America Bridge Accident :అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని అమెరికా తీరరక్షక దళం ప్రకటించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నదిలోతు, నీటి ఉష్ణోగ్రత, కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే వారు మరణించి ఉంటారని తీరరక్షక దశం ఉన్నతాధికారి తెలిపారు. బాధితులంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్ రవాణాశాఖ కార్యదర్శి పాల్ వైడెఫెల్డ్ చెప్పారు. గల్లంతైన వారు మెక్సికో, గ్వాటెమాలా, హోండూరస్ పౌరులుగా తెలుస్తోంది.
భారత సిబ్బందిపై బైడెన్ ప్రశంసలు
అటు ప్రమాద వివరాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియాకు వెల్లడించారు. నౌకలో మొదట విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఆ తర్వాత నౌకపై నియంత్రణ కోల్పోయామని సిబ్బంది మేరీలాండ్ రవాణాశాఖను అప్రమత్తం చేశారని వెల్లడించారు. దీంతో నౌక ఢీకొట్టక ముందే అధికారులు వంతెనను మూసివేశారని తెలిపారు. ఈ చర్యే మరిన్ని ప్రాణాలు కోల్పోకుండా చేసిందని వివరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రమాదం చేసినట్లు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. షిప్ నియంత్రణ కోల్పోయిందని గుర్తించి మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీని అప్రమత్తం చేసిన నౌకలో ఉన్న భారత సిబ్బందిపై బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
వంతెన పిల్లర్‌ను ఢీకొట్టిన నౌక
సరకు రవాణా నౌక వంతెన దిశగా కదులుతోందని 12 సెకండ్లతో కూడిన హెచ్చరిక మొదట తమకు వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వెంటనే తాము వంతెనకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశామని చెప్పారు. వంతెనపై మరమ్మతులు చేస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినా సమయ భావం వల్ల కుదరలేదని చెప్పారు. అర్ధరాత్రి ఒంటిగంటన్నరకు నౌక వంతెన పిల్లర్‌ను ఢీకొట్టిందని వెల్లడించారు.
బైడెన్ ఆదేశాలు
2.6 కిలోమీటర్ల పోడవైన ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనపై నిత్యం 30 వేల వాహనాల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. పైగా అమెరికాలోని ఈశాన్య ప్రాంతాన్ని ఇది అనుసంధానిస్తుంది. దీంతో యుద్ధప్రాతిపదికన వంతెనను పునరుద్ధరించాలని అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను పునరుద్ధరించేందుకు అమెరికా సైన్యానికి చెందిన ఇంజీనిరింగ్ విభాగం రంగంలోకి దిగనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దాదాపు వెయ్యి మంది ఇంజినీర్లు పునరుద్ధరణ పనుల్లో పాల్గొననున్నట్లు తెలిపింది.
మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులే
సింగపూర్ జెండాతో డాలీ అనే నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ నౌకను మెర్స్క్ షిప్పింగ్ కంపెనీ అద్దెకు తీసుకుంది. నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ వెల్లడించింది. వారెవరికీ గాయాలు కాలేదని తెలిపింది. ఈ ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో స్పందించింది. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితమైన భారతీయ పౌరుల సహాయార్థం ప్రత్యేక హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.