Manmohan Singh Village In Pakistan : భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ మృతికి దేశమంతా సంతాపదినాలు జరుపుకొంటోంది. అదే సమయంలో పాకిస్థాన్‌లోని ఓ గ్రామం కూడా ప్రపంచం మెచ్చుకున్న ఆర్థిక వేత్త మన్మోహన్ కోసం కన్నీళ్లు మున్నీరవుతోంది. ఆ గ్రామం పేరే గహ్. మన్మోహన్ సింగ్ జన్మించిన ఊరు అదే.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వాయవ్య సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది గహ్ గ్రామం. అక్కడి పాఠశాలలోనే మన్మోహన్ నాలుగో తరగతి వరకు చదివారు. మన్మోహన్ తండ్రి గురుముఖ్ సింగ్. దుస్తుల వ్యాపారి. తల్లి అమృత్ కౌర్ గృహిణి. గ్రామంలో మన్మోహన్‌సింగ్‌ను చిన్నప్పుడందరూ మోహన అని ముద్దుగా పిలిచేవారు. ఇప్పుడు మోహన ఇకలేరని తెలిసి గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.
గ్రామస్థులంతా సమావేశం
"మా గ్రామం మొత్తం విషాదంలో ఉంది. కుటుంబంలోని ఓ వ్యక్తి పోయినట్లే అందరూ బాధపడుతున్నారు" అని ఆ గ్రామానికి చెందిన అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. శుక్రవారం మన్మోహన్ మృతికి నివాళి అర్పించేందుకు గ్రామస్థులంతా సమావేశమయ్యారు. ఈ గ్రామంలో మన్మోహన్‌తో కలిసి చదువుకున్న చాలా మంది మిత్రులు 2004లో ఆయన ప్రధాని అయ్యేసరికే చనిపోయారు. 2008లో దిల్లీ రావాలని తన మిత్రుడు రాజా మొహమ్మద్ అలీకి మన్మోహన్ ఆహ్వానం పలికారు. ఆయన దిల్లీ వెళ్లారు. తర్వాత రెండేళ్లకే రాజా కూడా చనిపోయారు.
అది అసాధ్యం
"మన్మోహన్ మరణం మా గ్రామస్థులను కలచివేసింది. భారత్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరుకావాలని అనుకుంటున్నారు. కానీ అది అసాధ్యం. అందుకే ఇక్కడే సంతాపం తెలుపుతున్నా" అని రాజా అషిక్ అలీ తెలిపారు. ఈయన మన్మోహన్ మిత్రుడు రాజా మొహమ్మద్ అలీకి మేనల్లుడు. 2004లో మన్మోహన్ ప్రధాని అయినపుడు తమ గ్రామమంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన సంఘటనను అలీ గుర్తుకు తెచ్చుకున్నారు.
"మా గ్రామానికి చెందిన బాలుడు భారత ప్రధానమంత్రి అయ్యారని తెలిసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ నాడు గర్వంతో ఉప్పొంగిపోయారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి" అని చెప్పారు. గ్రామంలో మన్మోహన్ చదువుకున్న పాఠశాల ఇంకా అలానే ఉంది. అప్పటి రికార్డులు కూడా పదిలంగానే ఉన్నాయి. వాటి ప్రకారం పాఠశాలలో మన్మోహన్ అడ్మిషన్ నంబరు 187. జన్మదినం 1932, ఫిబ్రవరి 4. పాఠశాలలో 1937లో చేరారు. కులం కోహ్లి. దేశ విభజన సమయంలో మన్మోహన్ కుటుంబం అమృత్‌సర్‌కు తరలివెళ్లింది. అప్పటి నుంచి మళ్లీ మన్మోహన్ ఆ గ్రామానికి వెళ్లలేదు. "మోహన మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఆయన మరణవార్త మాకు చేరింది. కనీసం ఆయన కుటుంబసభ్యులైనా మా గ్రామానికి వస్తారని ఆశిస్తున్నాం" అని హుస్సేన్ తెలిపారు.