8 Passengers Ruby Franke Jail :రూబీ ఫ్రాంకే అమెరికాకు చెందిన ఓ ఫ్యామిలీ వ్లాగర్. పిల్లల పెంపకం, వారిని క్రమశిక్షణలో పెట్టడం, చిన్నారులను రేపటి పౌరులుగా ఎలా తయారు చేయాలో అనే అంశం గురించి చెప్పేందుకు 2015లో ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. భర్త కెవిన్, తనతో పాటు ఆరుగురు పిల్లల జీవితాన్ని ప్రపంచానికి చెప్పేందుకు ఆ ఛానెల్‌కు ఎయిట్ ప్యాసింజర్స్ అని పేరు పెట్టారు. 2020 జూన్ నాటికి ఎయిట్ ప్యాసింజర్స్ యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు 25 లక్షల మంది సబ్‌స్కైబర్లు, వంద కోట్ల వీక్షణలు వచ్చాయి. ఇంత వరకూ అంతా బాగానే ఉంది, కానీ పిల్లలను పెంచేందుకు ఎన్నో సలహాలు, సూచనలు, మార్గ నిర్దేశాలు చేసిన ఈ మాతృమూర్తి తన పిల్లల్ని తీవ్రంగా వేధించింది. క్రమశిక్షణ పేరుతో తన ఆరుగురు పిల్లలకు ప్రత్యక్ష నరకం చూపించింది. తినేందుకు తిండి కూడా సరిగ్గా పెట్టకుండా పిల్లలందరినీ కుర్చీలకు కట్టేసి రాక్షసిలా ప్రవర్తించింది. ఇదే కేసులో ఈమెను 2023 ఆగస్టు 30న పోలీసులు అరెస్ట్ చేసి తన ఆరుగురు పిల్లలపై తీవ్రమైన వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ అభియోగాల్లో నాలుగు నిరూపితం కావడం వల్ల తాజాగా కోర్టు ఆమెకు 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
బక్కచిక్కిపోయిన పిల్లలు
తన పిల్లలను అసలు బెడ్‌రూంలోకే అనుమతించలేదని, ఏడు నెలల పాటు వారందరూ కుర్చీలోనే పడుకున్నారని రూబీ ఫ్రాంకే ఒక వీడియోలో పోస్ట్ చేసింది. అంతేనా పిల్లలకు ఆహారాన్ని ఇవ్వకపోవడం సహా ఎన్నో శిక్షలను ఆ తల్లి అమలు చేసింది. ఈ విపరీత పోకడల కారణంగా 2021లో ఎయిట్ ప్యాసింజర్స్ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రజాదరణ తగ్గింది. ఆ తర్వాత ఏడాదే రూబీ ఫ్రాంకే భర్తతో విడిపోయింది. అనంతరం రూబీ మరింత ప్రమాదకరంగా తయారయ్యింది. ఇంటిని నిర్బంధ కేంద్రంగా మార్చి పిల్లలను ఖైదీలను చేసింది. హిట్లర్ తన బందీలను శిక్షించేందుకు అమలు చేసిన విధానాలనే తన పిల్లలకు కూడా రూబీ అమలు చేసింది. ఈ వేధింపులతో పిల్లలు బక్కచిక్కిపోయారు. చివరకు ఓ కుమారుడు కిటికీ నుంచి తప్పించుకుని పొరుగువారికి విషయం చెప్పడం వల్ల ఈ రాక్షసి దారుణాలు బహిర్గతమయ్యాయి.