Yoga Asanas For Gas Trouble :కడుపు ఉబ్బరం అనేది చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది క్రమంగా జీర్ణ సమస్యలు, మానసిక రుగ్మతలు, నిద్ర లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి అనేక మంది మందులపైనే ఆధారపడతారు. కానీ మందుల్లేకుండా సహజంగానే ఈ సమస్యను నివారించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
అసలేంటీ కడుపు ఉబ్బరం? ఎందుకు వస్తుంది?
కడుపు ఉబ్బరం అనేది మీ పొట్ట నిండుగా, బిగుతుగా ఉన్నట్లు అనిపించే ఒక రకమైన ఫీలింగ్. మన కడుపులో ఏర్పడే కొన్ని రకాల రసాయనాల ద్వారా ఇలా జరుగుతుంది. ఈ కడుపు ఉబ్బరం సాధారణంగా పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది మలబద్ధకం ద్వారా వస్తుంది. ఇదే కాకుండా గట్ సెన్సిటివిటీ, చిన్నపేగులో బ్యాక్టీరియా పెరుగుదల, గ్యాస్ట్రోపరేసిస్ సంబంధించి పలు రకాల సమస్యలను మనం గమనించవచ్చు.
అయితే ఎలాంటి మందులు వాడకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులున్నాయి. అందులో యోగా కూడా ఒకటి. కొన్ని ఆసనాల ద్వారా ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి తినటం, అధికంగా నూనె పదార్థాలు, పీచు పదార్థాలు తినటం, రుతు చక్రం మొదలైనవన్నీ కడుపు ఉబ్బరానికి దారితీస్తాయని అంటున్నారు. ప్రాథమికంగా ఈ సమస్య కడుపులోని పేగుల్లో గ్యాస్ ఉండటం వల్ల ఏర్పడుతుందంటున్నారు. దీనిని నివారించేందుకు కొన్ని యోగాసనాలు సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కటి చక్రాసనం
Standing Spinal Twist :పేరుకు తగ్గట్లుగానే ఈ ఆసనం వెన్నెముకకు సంబంధించినది. నేలపై నిల్చొని వీపును రెండు పక్కలా తిప్పుతూ ఉండాలి. ఈ సమయంలో చేతులను వదులుగా వదిలేయాలి. ఇలా రెండువైపులా కనీసం 10 రౌండ్లు, 2 నిమిషాల వరకు చేయాలి.
ఉత్తిత పార్శ్వకోనాసనం
Extended Side Angle Pose : కాళ్లను సాగదీసి ఒకవైపు వంగండి. ఇంకో కాలును చాపాలి. అప్పుడు వంగిన కాలుమీద చేతిని ఉంచి మరో చేతిని నిటారుగా పైకి చూపిస్తూ బాడీని వీలైనంత వరకు వంచాలి. మొదట్లో 15-20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోండి.
మండూకాసనం
Seated Frog Pose :ముందుగా వజ్రాసన భంగిమలో మీ కాళ్లను వెనుకకు మడిచి యోగా మ్యాట్‌పై కూర్చోండి. మీ చేతులను పిడికిలిగా చేసి, వాటిని ఉదరం దగ్గర పెట్టుకుని మెల్లగా ముందుకు వంగండి. ఈ ఆసనం కూడా మొదట్లో 15-20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోండి.