World Liver Day 2024 :మానవ శరీరంలో చర్మం తర్వాత అతి పెద్ద అవయవం కాలేయం. ప్రొటీన్ల జీర్ణక్రియ, ఖనిజాల నిల్వ, పిత్త ఉత్పత్తి, రక్తాన్ని వడకట్టడం లాంటి దాదాపు 500 కంటే ఎక్కువ విధులను లివర్ నిర్వహిస్తుంది. అంటే మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అలాంటి లివర్ పనితీరు ఎలా ఉంది? ఆరోగ్యంగానే ఉందా? అనే విషయాలను మనం అంత సులభంగా గుర్తించలేకపోవడం దురదృష్టకరమనే చెప్పుకోవాలి. నిజానికి లివర్ పాడవటానికి కేవలం మద్యపానం, ధూమపానం మాత్రమే అనుకుంటే మనం పొరపాటు పడ్డట్లేనట. ఇవి కాకుండా కాలేయాన్ని దెబ్బతీసే అంశాలేంటి? లివర్ ఆరోగ్యం దెబ్బతింటే ఏం జరుగుతుంది? ఏప్రిల్ 19వ తేదీ ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా మీకోసం ప్రత్యేక కథనం.
కాలేయం దెబ్బతినడానికి కారణాలు ఏంటి?
సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి మద్యపానం, ధూమపానం కారణమవుతాయి. నిజమే కానీ ఈ అలవాట్లు లేని వారిలో కూడా లివర్ సమస్యలు వస్తుంటాయి. మరి దీనికి కారణమేంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు తినే ఆహారం, తాగే నీరే! మీరు నమ్మలేకపోయినా ఇది వాస్తవం. మనం తినే ఆహార పదార్థాలు, తాగే నీరు కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ప్రస్తుత జీవన విధానంలో ఏది పడితే అది తింటూ పొట్టను చెత్త కుప్పలా మార్చుకుంటున్నాం. కలుషితమైన నీటిని తాగుతున్నాం. ఇలా మనకు తెలియకుండానే మన కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇవే కాకుండా హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, పటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్లు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, జన్యుపరమైన సమస్యలతో వారసత్వంగా వచ్చే ల్సన్ వ్యాధి, హిమోక్రోమాటోసిస్ వంటి వాటి వల్ల కూడా కాలేయ వ్యాధులు వస్తాయి. అంతేకాదు కొన్నిసందర్భాల్లో కాలేయంలో అసాధారణ కణాలు పెరిగి కణితులుగా మారి లివర్ క్యాన్సర్ రావచ్చు. శరీరంలో ఊబకాయం, మధుమేహం పెరిగితే కూడా కాలేయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతుంటారు.