తెలంగాణ

telangana

ETV Bharat / health

రక్తం రాలేదని తల గాయాన్ని వదిలేస్తే ప్రమాదమే! వెంటనే ఏం చేయాలి? - World Head Injury Awareness Day

World Head Injury Awareness Day : శరీరంలో వేరే ఎక్కడ గాయాలు తగిలినా పర్లేదు కానీ తలకు మాత్రం దెబ్బలు తగలకూడదు అని పెద్దలు అంటుంటారు. ఎంతో సున్నితంగా ఉండే తలకు గాయాలు తగిలితే తీవ్ర నష్టం కలుగుతుందని, కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్​ జరిగి అనుకోకుండా తలకు గాయాలు తగిలితే ముందుగా ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

World Head Injury Awareness Day 2024
World Head Injury Awareness Day 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 7:01 AM IST

World Head Injury Awareness Day :బైక్​ నడుపుతున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్​కు గురికావచ్చు. ఫలితంగా గాయాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అందులో తలకు ఏవైనా గాయాలు తగిలితే మాత్రం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. తలకు గాయాలు కేవలం యాక్సిడెంట్ ​వల్ల మాత్రమే తగులుతాయా, ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా, తలకు గాయాలు తగిలినప్పుడు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

తలకు తగిలే గాయాలు- రకాలు
సాధారణంగా తలకు గాయాలు యాక్సిడెంట్ల వల్ల తగులుతుంటాయి. కొన్నిసార్లు ఎత్తుపై నుంచి పడటం వల్ల కూడా తగులుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గొడవలు లాంటివి జరిగినప్పుడు తలకు గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే స్పోర్ట్స్​లో లేదంటే రేసింగ్​లో తలకు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. ఫుట్​బాల్​ లాంటి గేమ్స్​ ఆడేటప్పుడు, బాక్సింగ్​లో తలకు గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి.

రక్తం వస్తేనే తీవ్రం అని కాదు
మనలో చాలామందికి తలకు గాయం తగిలింది అని తెలియగానే రక్తం వచ్చిందా అని అడుగుతుంటాం. రక్తం రాకపోతే ఏమీ కాదు అని రిలాక్స్​ అవుతుంటాం. కానీ ఇది సరైన విధానం కాదు అని న్యూరోసర్జన్​లు అంటున్నారు. తలకు గాయాలు తగిలినప్పుడు రక్తం వచ్చినా, రాకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కేవలం రక్తం వస్తేనే తీవ్రంగా ఉన్నట్లు కాదని, కొన్నిసార్లు నరాలు చితికినా, కదిలినా తీవ్ర ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అలాగే గాయాలపాలైన వాళ్లు స్పృహ కోల్పోతే మాత్రం వెంటనే వైద్య చికిత్స అందించాలని సూచిస్తున్నారు.

ప్రథమ చికిత్స ఇలా చేయండి
యాక్సిడెంట్​ లేదంటే ఇతర ప్రమాదాల్లో తలకు గాయం తగిలితే వెంటనే రక్తస్రావాన్ని ఆపాలి. తలతో పాటు వెన్నుపూస, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయా అని చెక్​ చెయ్యాలి. అలాగే గాయాలపాలైన వాళ్లను నేల మీద పడుకోబెట్టి వాపు ఉందా అని చూడాలి. నోట్లో నుంచి రక్తస్రావం జరుగుతుంటే వెంటనే పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. ఇలా చేయకపోతే రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రమాదం తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది.

వైద్యులు ఇలా పరీక్షిస్తారు
తలకు గాయాలతో వచ్చిన పేషెంట్లను వైద్యులు పలు రకాలుగా పరీక్షించి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తారు. దీనిని మెడికల్​ స్కోరింగ్​ అంటారు. శరీరంలో ఇతర భాగాలు అన్ని సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే సీటీ స్కాన్​ చేసి, మెదడు లోపల రక్తం గడ్డ కట్టిందా అని చెక్​ చేస్తారు. ఎంఆర్ఐ చెక్​ చేసి వెన్నుపూసను పరిశీలిస్తారు. గాయం ఏ ప్రాంతంలో అయింది, దాని తీవ్రత ఎంత అనే దానిని బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

చాలా వరకు తలకు గాయాలైనప్పుడు రక్తం గడ్డ కట్టకపోతే ఆపరేషన్​ అవసరం లేకుండానే చికిత్స చేసి గాయాలను నయం చేస్తారు. మిగిలిన 10శాతం సందర్భాల్లో మాత్రం ఆపరేషన్​ లేదా ఇతర పద్ధతుల ద్వారా చికిత్స అందించి గాయాలను నయం చేస్తారు. చివరగా యాక్సిడెంట్​ లాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు విధిగా హెల్మెట్​ ధరించడం, ట్రాఫిక్​ రూల్స్​ను పాటించడం వంటివి చేస్తే మీ ప్రాణాలను కాపాడుకున్నవారవుతారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

హై-కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డు తినొచ్చా? - తింటే ఏమవుతుందో తెలుసా!

జుట్టు విపరీతంగా రాలుతోందా? తినే ఫుడ్​లో ఇది లోపించడమే కారణమట!

ABOUT THE AUTHOR

...view details