తెలంగాణ

telangana

ETV Bharat / health

'లేట్​గా పెళ్లి చేసుకోవడమూ క్యాన్సర్​కు కారణమే'- ఆహారంలో ఈ మార్పులు చేస్తే ఈ వ్యాధిని అడ్డుకోవచ్చట! - WORLD CANCER DAY 2025

-సుమారు 63శాతం క్యాన్సర్లు నివారించుకోదగినవేనట! -జీవనశైలి, ఆహార మార్పులతో క్యాన్సర్​ను అడ్డుకోవచ్చు!

world cancer day 2025
world cancer day 2025 (Getty Images)

By ETV Bharat Health Team

Published : Feb 4, 2025, 11:28 AM IST

Updated : Feb 4, 2025, 11:56 AM IST

Lifestyle Changes for Cancer Prevention: ప్రస్తుత ఆధునిక సమాజంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్లే అనేక ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్లు జన్యపరంగా వచ్చినా.. మరికొన్ని మనం చేసే తప్పుల వల్లే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సుమారు 63శాతం క్యాన్సర్లు నివారించుకోదగినవేనని అంటున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే ఊపిరితిత్తి, గొంతు, నోరు, అన్నవాహిక, జీర్ణాశయం, పేగులు, మలద్వార క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు. ఇందుకోసం ముఖ్యంగా మన జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"జీవనశైలి మార్పుల్లో ఆహారం.. అందులోనూ శాకాహారం అతి ముఖ్యమైనది. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారులైతే మాంసం తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. ఆయా కాలాల్లో దొరికే తాజా పండ్లు తప్పనిసరిగా తినాలి. కూరగాయల్లో, పండ్లలో క్యాన్సర్‌ను నిరోధించే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక మిఠాయిలు, ఐస్‌క్రీమ్‌ల వంటి వాటికి బదులు పండ్లు తినటం అలవాటు చేసుకోవాలి. వీటితో తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇంకా క్యాన్సర్‌ కారకాలేవైనా ఉన్నా తొలగిపోతాయి. చక్కెర, కొవ్వు పదార్థాలను తీసుకునేటప్పుడు సంయమనం పాటించాలి. ఇష్టమున్న పదార్థాలు మితంగా తినొచ్చు. కానీ, అది మితిమీరితేనే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అప్పుడప్పుడు వేపుడు పదార్థాలు తింటే ఇబ్బందేమీ లేదు గానీ రోజూ తినటం మంచిది కాదు. వీలైనంతవరకూ ఉడికించిన పదార్థాలు తినాలి. చైనా, జపాన్‌లో చాలా మంది ఎక్కువకాలం జీవించటానికి ఉడికించిన పదార్థాలు ఎక్కువగా తినటమూ ఒక కారణం. అలాగే కారం, మసాలాలు తగ్గించాలి."

--డాక్టర్ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి, క్యాన్సర్ వైద్యులు

ఊబకాయంతో పిత్తాశయ, గర్భాశయ, క్లోమ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి చెబుతున్నారు. కాబట్టి ఆహారంలో కేలరీలు, కొవ్వు తగ్గించుకోవటం ద్వారా బరువు అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా క్యాన్సర్ల నివారణకు వ్యాయామం చాలా ప్రధానమని.. రోజుకు కనీసం 40 నిమిషాల సేపు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. పెద్దవాళ్లు పాటించటమే కాకుండా, పిల్లలకూ చిన్నప్పటి నుంచే నేర్పించాలని అంటున్నారు.

ప్రస్తుతం పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవటం తగ్గిపోయింది. ఎంతసేపూ ఇంట్లోనే మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలం గడుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల పిల్లలు బరువు పెరుగుతున్నారు. ఫలితంగా ఎంతోమంది అమ్మాయిలు 9-10 ఏళ్లకే రజస్వల అవుతున్నారు. త్వరగా రజస్వల అయితే చిన్నవయసులోనే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఇది అండాశయాలు, రొమ్ములు, గర్భసంచిని చిన్నప్పటి నుంచే ప్రేరేపిస్తుంది. ఇలాంటివారికి పెద్దయ్యాక ఈ అవయవాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

--డాక్టర్ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి, క్యాన్సర్ వైద్యులు

క్యాన్సర్లకు పొగాకు ఆజ్యం
సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం.. పొగాకు, గుట్కా, ఖైనీ వంటివి నమలటం మూలంగానే 33శాతం క్యాన్సర్లు తలెత్తుతున్నాయని అంటున్నారు. కాబట్టి ఏ రూపంలోనూ పొగాకును తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇంకా మద్యంతో కాలేయ, నోరు, జీర్ణాకోశ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దీని జోలికి వెళ్లకపోవటం ఉత్తమమని.. ఒకవేళ మద్యం అలవాటుంటే మితం పాటించాలని సలహా ఇస్తున్నారు. మద్యంతో పాటు పొగ తాగే అలవాటు కూడా ఉన్నట్టయితే క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.

ఆలస్యంగా పెళ్లి కారణమే!
ముఖ్యంగా యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవటమూ క్యాన్సర్​కు ఒక కారణమేనని డాక్టర్ విజయ్ ఆనంద్​ రెడ్డి చెబుతున్నారు. సాధారణంగా గర్భం ధరించిన తర్వాత క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుందని వివరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంతోమంది చదువులు, ఉద్యోగాల పేరుతో పెళ్లి, పిల్లల్ని కనటం వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరుగుతోందని అంటున్నారు. కాబట్టి 22 నుంచి 24 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకోవటం, 27-28 ఏళ్ల మధ్యలో తొలి సంతానం కనటం మంచిదని సూచిస్తున్నారు. బిడ్డకు చనుబాలు ఇవ్వటంతోనూ రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ స్నానం చేయడం మంచిది కాదా? ఎన్ని రోజులకోసారి చేయాలి? నిపుణులు ఏం అంటున్నారంటే?

'రాత్రి ఎక్కువగా చెమటలు పట్టడం క్యాన్సర్ లక్షణమే'- ఇవన్నీ మీలో ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి!

Last Updated : Feb 4, 2025, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details