తెలంగాణ

telangana

ETV Bharat / health

అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వైద్యుల సూచనలు - Alzheimer Disease Symptoms - ALZHEIMER DISEASE SYMPTOMS

World Alzheimer Day 2024 : సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం. ఈ నేపథ్యంలో అల్జీమర్స్ డే ఎందుకు జరుపుతారు. అసలు అల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏ వయస్సు వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు ఏం చెబుతున్నాయి. వైద్యులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెెలుసుకుందాం.

World Alzheimer Day 2024
World Alzheimer Day 2024 (Getty Images)

By ETV Bharat Health Team

Published : Sep 21, 2024, 1:31 PM IST

World Alzheimer Day 2024 : అల్జీమర్స్ (మతిమరుపు ) వ్యాధి బారిన పడిన వారు ప్రతి చిన్నవిషయాన్ని మరిచిపోతుంటారు. అలాంటి వారిని సమాజం చులకన భావంతో చూస్తుంది. అందుకే సమాజంలో అల్జీమర్స్ రోగుల వ్యాధిగ్రస్తుల పట్ల ఉండే అభిప్రాయాల్ని రూపుమాపడానికి 1994 సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా అలాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి తోడ్పడుతుందని ప్రముఖ సైకియాట్రీ వైద్యులు విశాల్‌ ఆకుల అంటున్నారు. ఈ సందర్భంగా అల్జీమర్స్ వ్యాధి గురించి ఈటీవీ భారత్​తో ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. ఈ వ్యాధి గురించి ఆయన ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?:అల్జీమర్స్‌ వ్యాధి బారిన పడినవారు తమ స్వంత కుటుంబ సభ్యుల పేర్లను సైతం మరిచిపోతారని డాక్టర్ విశాల్‌ ఆకుల తెలిపారు. బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దారిచిపోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను, ఆఖరికి భోజనం చేసిన విషయాన్ని సైతం మరిచిపోవడం లాంటివన్నీ అల్జీమర్స్‌ తెచ్చిపెట్టే పెను సమస్యలే అంటున్నారు. ఈ వ్యాధి వల్ల వ్యక్తుల్లో శ్రద్ధ, ఏకాగ్రత సైతం తగ్గిపోతాయని తెలిపారు. ముఖ్యంగా తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్‌ ఒకటి అని వెల్లడించారు. ఈ మతిమరుపు వ్యాధి ముదిరేకొద్దీ ఆలోచనా శక్తి, సమస్యా పరిష్కార సామర్థ్యం లోపించడం లాంటివి తలెత్తుతాయంటున్నారు.

తాత్కాలిక మతిమరుపు :మనుషుల్లో ప్రధానంగా తాత్కాలిక మతిమరుపు, తీవ్ర మతిమరుపు(డిమెన్షియా)ను లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్. విశాల్‌ ఆకుల తెలిపారు. తాత్కాలిక మతిమరుపు 60 ఏళ్లలోపు వయసున్న వారిలో కనిపిస్తుందని వెల్లడించారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం వల్ల పిల్లలు, మధ్య వయస్కుల్లో తాత్కాలిక మతిమరుపు తలెత్తుతుందంటున్నారు. వారికి తగిన కౌన్సిలింగ్‌, పౌష్టికాహారం అందిస్తే మళ్ళీ మామూలు స్థితికి చేరతారని ఆయన స్పష్టం చేశారు.

తీవ్ర మతిమరుపు: తీవ్ర మతిమరుపు అనేది 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు డాక్టర్ విశాల్‌ ఆకుల. మెదడులో ఉండే అమలాయిడ్‌ అనే ప్రొటీన్‌ నాడీకణాల్లో పేరుకుపోయి, సమాచారాన్నిచేరవేయడానికి ఇబ్బంది తలెత్తుతుందంటున్నారు. అందువల్ల వల్ల తీవ్ర మతిమరుపు వస్తందని వెల్లడించారు. 70 శాతం డిమెన్షియా బాధితుల్లో అల్జీమర్స్‌ కనిపిస్తుందంటున్నారు. రక్తనాళాలు, మెదడులో సమస్యలు ఏర్పడినప్పుడూ డిమెన్షియా బారినపడే ప్రమాదం ఉందని తెలిపారు.

డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.5 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు తెలుపుతున్నాయి. గతంలో పోలిస్తే ప్రస్తుతం ప్రజల ఆయుర్దాయం పెరిగింద. ఎంతోమంది అరవై ఏళ్లకు పైబడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా బాధితుల సంఖ్య పదిహేను కోట్లు దాటిపోయే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. డిమెన్షియా బాధితుల్లో 60శాతం అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది. (National Institutes of Health) రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

గ్రామీణ ప్రాంత ప్రజల్లో : భారతదేశంలో సుమారు 88 లక్షల మంది డిమెన్షియాతో ఇబ్బంది పడుతున్నారని విశాల్‌ ఆకుల తెలిపారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌-దిల్లీ), బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్య, నాడీ విజ్ఞాన సంస్థ(నిమ్‌హాన్స్‌)లలో జరిగిన అధ్యయనాల ప్రకారం దేశీయంగా స్త్రీలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో డిమెన్షియా సమస్య అధికంగా ఉందని గుర్తించినట్లు వెల్లడించారు. బి, డి, ఇ విటమన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం తీవ్ర మతిమరుపునకు దారితీస్తున్నట్లు వైద్య పరిశోధనల్లో తెలిందన్నారు.

మత్తుపదార్థాల వాడకం: థైరాయిడ్‌, రక్తహీనత, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మెదడును ప్రభావితం చేసే వివిధ రకాల వ్యాధులు, గాయాలవల్ల, జన్యుపరంగానూ డిమెన్షియా తలెత్తవచ్చని డాక్టర్ విశాల్‌ ఆకుల తెలిపారు. దీన్ని నివారించాలంటే మత్తుపదార్థాలు, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల వాడకం, గుట్కా, ఖైనీ తదితరాల వినియోగంవల్ల డిమెన్షియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని విశాల్‌ ఆకుల స్పష్టం చేశారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి : పౌష్టికాహారం, ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని విశాల్‌ ఆకుల సూచిస్తున్నారు. చేపలు, పాలు, పెరుగు, అవిసెలు, బాదం, జీడిపప్పు తదితరాల్లో ఇవి అధికంగా ఉంటాయని వాటిని తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. అరటి, ఇతర తాజా పండ్లు సైతం మతిమరుపును దూరంగా ఉంచుతాయని వెల్లడించారు. అయితే, పౌష్టికాహారంపై సరైన అవగాహన లేకపోవడం. వాటిని కొనుగోలు చేసే స్థోమత కొరవడటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమెన్షియా సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

వ్యాయమం : చిన్నప్పటి నుంచి మెదడుకు పదునుపెట్టే చదరంగం, పజిల్స్‌ పూరించడం తదితరాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అలాగే రోజూ వ్యాయామం చేయడంవల్ల మెదడుకు రక్త సరఫరా పెరిగి, డిమెన్షియా ముప్పు నుంచి తప్పించుకోవచ్చని విశాల్‌ఆకుల తెలిపారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? - బ్రెయిన్​లో ఏదో జరుగుతోందని టెన్షన్​ పడుతున్నారా?? - ఇలా చేయండి! - Brain Health Improve Tips

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఐదు పనులు చేస్తే అంతా సెట్! - Memory Power Increase Tips

ABOUT THE AUTHOR

...view details