తెలంగాణ

telangana

ETV Bharat / health

డైలీ బ్రేక్​ఫాస్ట్ తినట్లేదా? అయితే, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే! - SKIPPING BREAKFAST EFFECTS ON BODY

-ఉదయం అల్పాహారం చేయని వారిలో గుండె సమస్యలు -ఇక్హాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Breakfast Skipping Effects on Health
Breakfast Skipping Effects on Health (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 3, 2024, 12:46 PM IST

Breakfast Skipping Effects on Health: ఉదయం పూట బ్రేక్​ఫాస్ట్ చేయట్లేదా? అయితే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని మీరు తగ్గించుకుంటున్నట్టే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంకా గుండెజబ్బుల ముప్పును పెంచుకుంటున్నట్టేనని Journal of Circulationలో ప్రచురితమైన Association of Skipping Breakfast With Cardiovascular and All-Cause Mortality అధ్యయనంలో తేలింది. ఫిలిప్‌ స్విర్స్కీ నేతృత్వంలో మౌంట్‌ సినానీలోని ఎలుకలపై నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని.. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నట్టు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉపవాసం విషయంలో జాగ్రత్త అవసరమని, దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని తమ పరిశీలనలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఫిలిప్‌ స్విర్స్కీ వివరించారు. ఉపవాసానికీ నాడులు, రోగనిరోధక వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు బయటపడిందని పరిశోధకులు చెబుతున్నారు.

కొద్ది గంటల సేపు, తీవ్రంగా 24 గంటల సేపు ఉపవాసం చేయటం రోగనిరోధక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని పరిశోధకులు విశ్లేషించారు. ఇందుకోసం కొన్ని ఎలుకలకు లేచిన వెంటనే ఆహారం ఇచ్చి, మరికొన్ని ఎలుకలను ఉపవాసం ఉంచారు. దీంతో పాటు లేచిన వెంటనే, నాలుగు గంటల తర్వాత, ఎనిమిది గంటల తర్వాత వాటి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఉపవాసం ఉన్న ఎలుకల్లో మోనోసైట్స్‌ అనే తెల్ల రక్తకణాల సంఖ్యలో గణనీయమైన తేడాలు కనిపించాయని చెబుతున్నారు. ఎముక మజ్జ నుంచి తయారయ్యే ఈ కణాలు శరీరమంతటా తిరుగుతూ ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయన్నారు. ముఖ్యంగా గుండెజబ్బు, క్యాన్సర్లలోనూ కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు.

మొదట్లో అన్ని ఎలుకల్లోనూ మోనోసైట్ల సంఖ్య సమానంగానే ఉందని.. కానీ ఉపవాసం చేసిన వాటిల్లో నాలుగు గంటల తర్వాత గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. మొదట్లోనే రక్తంలోంచి మోనోసైట్లు 90% వరకు కనుమరుగవ్వగా.. ఎనిమిది గంటల తర్వాత మరింత తగ్గిపోయాయని వివరించారు. ఈ మోనోసైట్లు తిరిగి ఎముకమజ్జకు చేరుకొని, నిద్రాణస్థితికి వెళ్లిపోయాయని తెలిపారు. ఫలితంగా ఎముకమజ్జలో కొత్త కణాల ఉత్పత్తి పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాత కణాలు ఎక్కువసేపు అక్కడే ఉండిపోవటం వల్ల రక్తంలోని మోనోసైట్ల కన్నా భిన్నంగా తయారయ్యాయని వెల్లడించారు.

ఒక రోజు తర్వాత ఎలుకలకు ఆహారం ఇవ్వగా అప్పటివరకు ఎముకమజ్జలో దాచుకున్న మోనోసైట్లు కొద్దిగంటల్లోనే మళ్లీ రక్తంలోకి వచ్చాయని వివరించారు. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) పెద్ద మొత్తంలో తలెత్తిందని పేర్కొన్నారు. ఈ మారిపోయిన కణాలు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించటం కన్నా వాపుప్రక్రియను పెంచాయని అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే శక్తి సన్నగిల్లి.. గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి వాటికి వాపు ప్రక్రియే మూల కారణంగా నిలుస్తోందనే విషయాన్ని గుర్తించారు.

ఉపవాసంతో మెదడులో ఒత్తిడి ప్రతిస్పందన తలెత్తటం వల్ల ఆకలితో కూడిన కోపాన్ని ప్రేరేపిస్తున్నట్టూ తేలిందని పేర్కొన్నారు. తెల్ల కణాలు ఉన్నట్టుండి రక్తంలోంచి ఎముకమజ్జలోకి.. తిరిగి మజ్జలోంచి రక్తంలోకి వెళ్లిపోవటానికి ఇదే సాయం చేస్తోందని కనిపెట్టారు. ఉపవాసంతో జీవక్రియల పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని.. కానీ అన్నీ లాభాలే ఉంటాయని అనుకోకూడదని అంటున్నారు. శరీర వ్యవస్థల మీద ఉపవాసం ఎలాంటి ప్రభావాలను చూపుతోందనేది లోతుగా అర్థం చేసుకోవటానికి తమ అధ్యయనం తోడ్పడిందని పరిశోధకులు అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఐరన్ లోపంతో అనేక వ్యాధులు- ఇవి తింటే చాలు ఏ రోగాలు రావట!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details