Why do Women Need More Sleep than Men :సగటున ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. కానీ, ఓ పరిశోధనలో ఎవరు ఎంతసేపు నిద్రపోవాలనేది వయసు ఆధారంగానే కాకుండా.. జెండర్ మీద ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది. దీని ప్రకారం.. పురుషుల కంటే మహిళలకు కొంచెం ఎక్కువ నిద్ర అవసరమని తేలింది. ఇంతకీ, మగవారి కంటే ఆడవారికి ఎంత సేపు ఎక్కువ నిద్ర అవసరం? కారణాలేంటి? సరైన నిద్ర(Sleep) కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2014లో స్లీప్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మహిళలకు సగటున 7 గంటల 40 నిమిషాల నిద్ర అవసరం కాగా, పురుషులకు 7 గంటల 20 నిమిషాల నిద్ర అవసరమని తేలింది. అంటే ఈ అధ్యయనం ప్రకారం.. పురుషుల కంటే స్త్రీలకు దాదాపు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని స్పష్టమైంది. సుమారు 40 సంవత్సరాలు నిండిన 2,100 మంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేశారు. మరి మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలిపేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ :మగవారి కంటే ఆడవారు నిద్రలేమిని అనుభవించే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే వారు పురుషుల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడే అవకాశం ఉంటుందట. ఈ పరిస్థితుల కారణంగా మహిళలకు కంటి నిండా నిద్రపట్టే అవకాశం తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి రాత్రిపూట మహిళలు ఎక్కువగా నిద్రపోయేలా చూసుకోవడం మంచిది అంటున్నారు.
హార్మోన్ల మార్పులు :మహిళల్లో హార్మోన్ల మార్పులు సహజం. మహిళల హార్మోన్లు నెలవారీగా, జీవితాంతం మారుతూ ఉంటాయి. ఈ మార్పులు నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా నిద్ర పోవాల్సిన అవసరం వస్తుంది.
పీరియడ్స్ :చాలా మంది మహిళలు పీరియడ్స్ టైమ్‌లో నొప్పి, తిమ్మిర్లు, అసౌకర్యం కారణంగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. రుతుచక్రంలోని వివిధ స్టేజెస్‌లో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు ఛేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మార్పులు కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు.