When Should ORS be Given to Children:వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్నే డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మూడు లేక అంతకంటే ఎక్కువసార్లు విరేచనాలు వస్తే అతిసారంగా భావిస్తారు. అయితే ఎక్కువ సార్లు విరేచనాలు అయినా, వాంతులు అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓఆర్ఎస్ (ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్) ఇస్తుంటారు. కొద్దిమంది చాలా మొత్తంలో పిల్లల చేత బలవంతంగా అయినా తాగిస్తుంటారు. అసలు పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వొచ్చా? ఇస్తే ఎంత మేర ఇవ్వాలి? అనే సందేహాం చాలా మందికి ఉంటుంది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలను ప్రముఖ పిడియాట్రిషిన్ 'డాక్టర్ రమేష్ దాసరి' అందిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
డీహైడ్రేషన్:సాధారణంగా చిన్నపిల్లల్లో డయేరియా, వాంతుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా చాలా మంది పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. డీహైడ్రేషన్ అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం. శరీరంలోకి వెళ్లే నీటి కన్నా బయటకు వెళ్లే వాటర్ ఎక్కువున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక డీహైడ్రేషన్ లక్షణాలు చూస్తే..
ప్రధాన లక్షణాలివీ..
- నీళ్లు తాగినా కూడా తరచూ ఎక్కువ నీరు తాగాలనిపిస్తుంది.
- డీహైడ్రేషన్‌కు గురైతే మూత్రం చిక్కగా పసుపు రంగులో వస్తుంది.
- పిల్లల్లో నిస్సత్తువ, నోరు పొడిబారడం, శరీరమంతా వేడిగా ఉండడం వంటి లక్షణాలు డీహైడ్రేషన్ సమస్యని సూచిస్తాయి.
- చిన్న పిల్లలు తల్లి దగ్గర పాలు తాగినా ఏడుస్తున్నా, రోజుకి ఏడు లేదా ఎనిమిది సార్ల కంటే తక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తున్నా తల్లిపాలు సరిపోక డీహైడ్రేషన్‌కు గురయ్యారని గ్రహించాలి.
ఓఆర్ఎస్ ద్రావణం ఎప్పుడు ఇవ్వాలి:పిల్లల్లో విపరీతమైన వాంతులు, నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు వాళ్ల శరీరంలో నుంచి పోతున్న నీళ్లని రీప్లెస్ చేయడానికి ఓఆర్ఎస్ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే ఈ ద్రావణాన్ని డాక్టర్ల సలహా మేరకే ఇవ్వాలని డాక్టర్ రమేష్ అంటున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
- శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి.
- ఇక 10 కేజీల లోపు బరువున్న పిల్లలకు విరేచనాలు/వాంతులు అయిన ప్రతిసారీ 50 ml ఓఆర్ఎస్ ఇవ్వాలంటున్నారు.
- 10 కేజీలకు పైగా బరువున్న పిల్లలకు విరేచనాలు/వాంతులు అయిన ప్రతిసారీ 100 ml ఓఆర్ఎస్ ఇవ్వాలి. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి తాగించకుండా మెల్లిగా తాగించాలని సూచిస్తున్నారు.
పిల్లలకు ఓఆర్ఎస్ ఎప్పుడు ఇవ్వకూడదు:ఓఆర్ఎస్ మంచిది కదా అని దానిని పిల్లలకు అదేపనిగా ఇవ్వొద్దని అంటున్నారు. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో అసలు ఇవ్వకూడదని చెబుతున్నారు.
- పిల్లల్లో కొన్నిసార్లు అదేపనిగా వాంతులు అవుతుంటాయి. అంటే ఏది తిన్నా లేదా తాగినా వెంటనే వాంతుల రూపంలో బయటికి వస్తుంటాయి. ఇటువంటి సమయంలో బలవంతంగా ఓఆర్ఎస్ తాగించకూడదని అంటున్నారు.
- అలాగే ఆకుపచ్చ రంగులో వాంతులు అవుతున్నప్పుడు కూడా ఓఆర్ఎస్ ఇవ్వకూడదని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు.
- పిల్లలు కొన్ని సార్లు డీహైడ్రేషన్ కారణంగా సృహ తప్పుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా బలవంతంగా ఓఆర్ఎస్ తాగించకూడదని అంటున్నారు.