Vitamins : రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాడు. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్, బ్యాక్టీరియాలు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేవంటున్నారు నిపుణులు. అయితే రోగనిరోధక శక్తి దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా కీలకమని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని విటమిన్లు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆయా విటమిన్ల లోపం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
విటమిన్ 'సి'
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ 'సి' కీలక పాత్ర పోషిస్తుందటున్నారు నిపుణులు. ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్లు త్వరగా జబ్బు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అందుకే మనం రోజూ తినే ఆహారంలో విటమిన్ 'సి' పుష్కలంగా లభించే కమలాఫలంతో పాటుగా నిమ్మకాయ వంటి నిమ్మజాతి పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యాప్సికం, పాలకూర వంటివి కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
విటమిన్ 'సి' లోపం వల్ల కనిపించే లక్షణాలు : విటమిన్ 'సీ'లోపం వల్ల శరీరం అలసటగా ఉంటం, శ్వాస ఆడకపోవటం, పాలిపోయిన చర్మం, ఐరన్ లోపం ఉండటం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే దంత సమస్యలు, చిగుళ్ల వాపు, రక్తస్రావం లాంటి సమస్యలు కొన్ని సార్లు కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ 'బి6'
రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ 'బి6' సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎదైనా ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్ 'బి6' అధికంగా లభించే అరటిపండ్లు, చేపలు, చికెన్, బంగాళాదుంపలు, శెనగలు లాంటి ఆహార పదార్థాల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
విటమిన్ ‘బి6’ లోపం వల్ల కనిపించే లక్షణాలు :ఫిట్సు లాంటి వ్యాధులు, అజీర్తి, రక్తహీనత, కోపం ఎక్కువగా రావడం, చర్మ వ్యాధులు, అనీమియా, మొటిమలు లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ 'ఇ'విటమిన్ 'ఇ'
మన శరీరంలో ఒక శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనిని 'బ్యూటీ విటమిన్' అని కూడా వ్యవహరిస్తారు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడి అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఆపుతుంది. అలాగే ఈ విటమిన్ రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరచడంలోనూ సహకరిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా లభించే పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదంపప్పులు, పాలకూర, నట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ 'ఇ' లోపం వల్ల కనిపించే లక్షణాలు :కండరాల క్షీణత, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో రుతుస్రావం, గర్భస్రావం వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.