HMPV Virus is Dangerous: కొవిడ్-19 దాడి నుంచి ఇప్పుడే కోలుకుంటుండగా.. మరో కొత్త వైరస్ ఆందోళన ప్రజల్లో మొదలైంది. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మనదేశంలోనూ ఈ వైరస్ కేసులు బయటపడినట్టు తేలడంతో అందరిలో భయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడిదీ వైరస్?
మామూలు జలుబు మాదిరిగానే హెచ్‌ఎంపీవీ కూడా దిగువ, పై శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.వి రావు చెబుతున్నారు. ఇది రెస్పిరేటరీ సిన్‌సిషియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ) వంటి వైరస్‌ల తరగతికి చెందినదని.. దీన్ని 24 ఏళ్ల క్రితమే 2001లోనే నెదర్లాండ్స్‌లో గుర్తించారని వివరించారు. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా సోకొచ్చు గానీ చలికాలం, వసంతకాలం ఆరంభంలో ఎక్కువగా వ్యాపిస్తుందని వెల్లడించారు. హెచ్‌ఎంపీవీ కొందరిలో న్యుమోనియాకు దారితీయొచ్చని.. ఆస్థమా, సీఓపీడీ వంటి జబ్బులను ఉద్ధృతం చేయొచ్చని అంటున్నారు. ఇంకా చాలామందికి ఐదేళ్లలోపే ఇది తొలిసారి సోకుతుందని.. అనంతరం ఎప్పుడైనా మళ్లీ వచ్చినా లక్షణాలు చాలావరకూ మామూలుగానే ఉంటాయన్నారు. ఇలా పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 10-12% హెచ్‌ఎంపీవీయే కారణమవుతున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలామందిలో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుందని అంటున్నారు. కానీ 5-16% మంది పిల్లల్లో న్యుమోనియా వంటి దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని హెచ్చరించారు.
"హెచ్‌ఎంపీవీయే నిజానికి మామూలు జలుబు, ఫ్లూ వైరస్‌ల వంటిదే. సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ముఖ్యంగా 6-12 నెలల పిల్లలకు ఎక్కువగా సోకుతున్నట్టు పలు దేశాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి అంత తీవ్రమైంది కాదు. కాకపోతే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పిల్లలకు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అలాగే 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ మామూలు జలుబులా మొదలై అరుదుగా కొందరికి న్యుమోనియాగా మారే అవకాశం ఉంది. ఇంకా గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు, మధుమేహం, ఆస్థమా, నాడుల బలహీనత, సీవోపీడీ, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి.. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి, అవయవాలు మార్పిడి చేయించుకున్నవారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది."
--డాక్టర్ ఎం.వి రావు, జనరల్ ఫిజీషియన్
కొవిడ్‌లా ప్రమాదకరం కాదు
ఇది కొవిడ్ అంత తీవ్రమైన వైరస్ కూడా కాదని డాక్టర్ ఎం.వి రావు వెల్లడించారు. రక్తనాళాలను దెబ్బతీయటం, రక్తం గడ్డలు ఏర్పడేలా చేయటం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయదని వివరించారు. కొవిడ్-19కూ హెచ్‌ఎంపీవీకి తేడా ఏంటంటే ఇది కొత్తది కాకపోవటమేనని చెబుతున్నారు. అప్పట్లో కొవిడ్-19 కొత్త వైరస్ కావటం వల్ల దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరంలో యాంటీబాడీలు లేకపోవడం వల్ల తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ప్రస్తుతం మనం దాన్ని ఎదుర్కొనే నిరోధకశక్తి సంతరించుకోవటం వల్ల అదే కొవిడ్ ఇప్పుడు మామూలు జలుబులా మారిందని అంటున్నారు. హెచ్‌ఎంపీవీ ఎప్పటినుంచో ఉంది కాబట్టి చాలామందిలో దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండే ఉంటాయని అభిప్రాయపడ్డారు. కాబట్టి అంతగా భయపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు.