What Happens Stop Eating Non Veg For A Month :ప్రస్తుత కాలంలో మెజార్టీ ప్రజలు నాన్‌వెజ్ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటున్నారు. కొంత మందికైతే అసలు రోజూ ముక్కలేనిది ముద్ద దిగదు. చికెన్, మటన్, ఫిష్ వంటి ఏదో ఒక నాన్‌వెజ్ ఐటమ్ తప్పకుండా ఉండాల్సిందే. ఇక సండే వచ్చిందటే చాలు.. దాదాపు అందరి ఇళ్లలో మాంసాహార వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. ఇలా నాన్‌వెజ్ రెసిపీలను ఇష్టపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇది ఇలా ఉంటే.. కొంత మంది డైటింగ్ చేసేవారు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. అయితే, ఒక నెల రోజుల పాటు మాంసాహారం తినకుండా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గుతారు :
నాన్‌వెజ్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు.. చికెన్, మటన్ వంటి వాటిని అధికంగాతినడం వల్ల ఇంకా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నెల రోజుల పాటు నాన్‌వెజ్ తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గే ఛాన్స్ ఉందట. క్యాలరీలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు పేర్కొన్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
నాన్‌వెజ్ వంటకాలను కొన్ని రోజులు తినకపోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుందని అంటున్నారు.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి :
నాన్‌వెజ్ వంటకాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అయితే, ఒక నెల రోజులపాటు మాంసాహారం తినకపోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నాన్‌వెజ్ తినకపోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని పేర్కొన్నారు.