తెలంగాణ

telangana

ETV Bharat / health

ఐరన్ లోపంతో అనేక వ్యాధులు- ఇవి తింటే చాలు ఏ రోగాలు రావట!

-ఐరన్ లోపంతో రక్తహీనత సహా అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ -రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే చాలంటున్న నిపుణులు

Iron Rich Foods in Telugu
Iron Rich Foods in Telugu (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 3, 2024, 10:36 AM IST

Iron Rich Foods in Telugu:మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజం ఇనుము. దీని లోపం ఉంటే హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా అలసట, నీరసం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు నెలసరి సమయంలో బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం వంటి ప్రత్యుత్పత్తి సమస్యలూ వస్తాయని వివరించారు. అందుకే ఈ సమస్యను అధిగమించాలంటే ఐరన్‌ అధికంగా ఉండే పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. గుడ్లు, పాలు, మాంసం, చేపలు, ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే, కొంతమంది ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివే తింటుటారు. అవి రుచికరంగా ఉండవని కొంతమంది బాధపడుతుంటారు. కానీ కొన్ని రుచికరమైన పదార్థాల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కిస్‌మిస్
ఐరన్ లోపం ఉన్నవారు కిస్‌మిస్ తినడం వల్ల ఎక్కువ మొత్తంలో ఇనుము లభిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇటు రుచికరంగా ఉండడం మాత్రమే కాకుండా.. ఐరన్‌తో పాటు మరెన్నో పోషకాలు కిస్‌మిస్​లో ఉన్నాయని వివరించారు. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా నాలుగైదు కిస్‌మిస్‌లను నోట్లో వేసుకుంటే తీపి తినాలన్న కోరిక కూడా పోతుందని చెబుతున్నారు. వీటిని ఉదయాన్నే ఓట్‌మీల్‌లో, సలాడ్స్‌లో, పెరుగులో కలిపి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంకా చక్కటి బ్యాలన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్‌గా పనికొస్తాయని అంటున్నారు.

నువ్వులు
మనలో చాలా మంది నువ్వులు తింటే వేడి చేస్తుందని దూరంగా ఉంంటారు. కానీ అసలు విషయం తెలిస్తే రోజూ వీటిని తప్పకుండా తీసుకుంటారని అంటున్నారు నిపుణులు. రోజూ తీసుకోవాల్సిన ఐరన్‌లో దాదాపు 80 శాతం నువ్వుల నుంచి లభిస్తుందని వెల్లడించారు. నువ్వులను పెరుగు, సలాడ్లు, ఇతర ఆహారపదార్థాల్లో చల్లుకొని తీసుకోవడం, కూరల్లో నువ్వుల పొడి వేసుకోవడంతో పాటు నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, చిక్కీలు తీసుకోవడం వల్ల ఐరన్ శాతం పెరుగుతుందని వివరించారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరమని.. దీన్ని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

డార్క్ చాక్లెట్
చాలా మందికి చాక్లెట్ తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే, ఇందులో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుందని తెలిపారు.​ మనం రోజూ తీసుకోవాల్సిన మొత్తం ఐరన్‌లో 45 శాతానికి పైనే డార్క్ చాక్లెట్‌లో ఉంటుందని అంటున్నారు. ఇందులో కేవలం ఐరన్ మాత్రమే కాకుండా.. మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఇంకెన్నో పోషకాలు కూడా ఉంటాయని వివరించారు. అయితే ఎంత మంచిదైనా డార్క్ చాక్లెట్‌ని రోజూ ఓ చిన్న ముక్క కంటే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది అని సూచిస్తున్నారు.

ఎండు ఫలాలు
ఎండిన టమాటాలు, అల్‌బుకారా, ప్రూన్స్, పీచ్, ఆప్రికాట్స్ ఇలా ఎండిన ఫలాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫలాలన్నింటిలో ఐరన్ పుష్కలంగా లభించడమే కాకుండా.. ఇందులోని ఎన్నో పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. తక్కువ క్యాలరీలే ఉండడంతో బరువు పెంచకుండానే పోషకాలన్నింటినీ అందిస్తాయని నిపుణులు వివరించారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్స్ రోజు ఎంత నీరు తాగితే మంచిది? తలనొప్పికి వాటర్​తో చెక్!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details