తెలంగాణ

telangana

ETV Bharat / health

పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదా? ఈ కారణాలు తెలిస్తే ఈజీగా ఆపొచ్చట! - BABY CRYING REASONS

-ఆకలితో పాటు ఇతర కారణాలు వల్ల కూడా ఏడుస్తారట -అవేంటో తెలుసుకుంటే పిల్లల్ని హాయిగా నిద్రపుచ్చొచని వెల్లడి

Baby Crying Reasons
Baby Crying Reasons (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 30, 2024, 10:52 AM IST

Baby Crying Reasons: పసిపిల్లలు ఏడిస్తున్నారంటే చాలు.. ఆకలి వేస్తోందేమోనని వెంటనే పాలివ్వడం, ఆహారం తినిపిస్తుంటారు చాలామంది తల్లులు. అయినా సరే కొందరు.. ఆగకుండా ఏడూస్తునే ఉంటారు. ఒక్కోసారి అసలు వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో అర్ధం కాక కొత్తగా తల్లైన మహిళలు ఆందోళన చెందుతుంటారు. అయితే, అన్ని సందర్భాల్లో వారు ఆహారం కోసం ఏడవరని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణంగా పిల్లలు ఏడవడానికి గల కొన్ని కారణాలు, ఏడుపు ఆపేందుకు పాటించాల్సిన చిట్కాల గురించి ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ అపర్ణ వత్సవాయి వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డైపర్ మార్చమని
ముఖ్యంగా పసిపిల్లలు తమ డైపర్ తడిసిందంటే చాలు.. ఏడుపు మొదలెడతారు. ఎందుకంటే ఆ తడిదనం వల్ల వాళ్లకు అసౌకర్యంగా అనిపించి.. ఫలితంగా దాన్ని మార్చమని ఏడుపు రూపంలో చెబుతుంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి కేవలం ఏడ్చినప్పుడు మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు పిల్లలకు వేసిన డైపర్ చెక్ చేసుకుంటూ, మార్చుతూ ఉండాలని చెబుతున్నారు. లేదంటే ఆ తడి వల్ల చిన్నారలకు ఎలర్జీ, దురద వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అసౌకర్యంగా అనిపించి
ఇంకా కొంతమంది పిల్లలు నిద్రొచ్చి కూడా ఏడుస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పడుకోబెడితే పడుకోరని.. వాళ్లు పడుకునే ప్రదేశం మెత్తగా ఉండాలని అంటున్నారు. ఇలా లేకపోతే వారు అసౌకర్యంగా ఫీలై ఏడుస్తుంటారని వివరిస్తున్నారు. కాబట్టి వాళ్లు పడుకునే ప్రదేశం మెత్తగా ఉందో లేదో ముందే సరిచూసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. లేదంటే నిద్రొచ్చినా నిద్ర పట్టకపోవడంతో ఏడుస్తుంటారని తెలిపారు. అలాగే ఏ చిన్న శబ్దమైనా కొంత మంది పసిపిల్లలు మధ్యలోనే లేచి ఏడుస్తుంటారు. ఫలితంగా నిద్ర సరిపోకపోవడం వల్ల చిరాకుకు గురై ఏడుస్తుంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి పిల్లలు పడుకునే ప్రదేశాలు ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా వారికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని వివరిస్తున్నారు.

ఆకలి వేయడం
వాస్తవానికి చెప్పాలంటే పెద్దవాళ్లే ఆకలికి తట్టుకోలేరు.. అలాంటిది ఇక పసిపిల్లల సంగతి చెప్పే పనే లేదు. కాబట్టి వాళ్లకు ఆకలి వేసినప్పుడు కూడా బాగా ఏడుస్తుంటారని నిపుణులు అంటున్నారు. మరి వాళ్ల ఏడుపును ఆపాలన్నా.. ఈ కారణం వల్ల ఏడవకుండా ఉండాలన్నా టైం ప్రకారం వాళ్లకు పాలివ్వడం, ఆహారం తినిపించడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇలా సమయానుసారం క్రమం తప్పకుండా వాళ్ల కడుపు నింపడం పిల్లల ఆరోగ్యానికీ చాలా మంచిదని వివరిస్తున్నారు.

వాతావరణం
తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రాగానే ఏడుపు మొదలుపెడుతుంది. గర్భం లోపల, బయట వాతావరణానికి చాలా తేడా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతుంటారు. అప్పటి వరకూ ఉన్న వెచ్చటి వాతావరణానికి అలవాటు పడిన బిడ్డ ఒక్కసారిగా బయటికి రావడంతో దాన్ని తట్టుకోలేక ఏడుస్తుంటుందని వివరిస్తున్నారు. పసిపిల్లలు వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా ఉన్నా.. ఓర్చుకోలేరని నిపుణులు అంటున్నారు. అందుకే అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేందుకు కావాల్సిన అన్ని సదుపాయాల్ని చిన్నారులకు అందించాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

లేడీస్ PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే ఈజీగా తగ్గే ఛాన్స్!

జలుబు, దగ్గుతో ఇబ్బందా? రాత్రి నిద్ర కూడా పట్టట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా తగ్గే ఛాన్స్!

ABOUT THE AUTHOR

...view details