తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు నిద్రలో చెమటలు పడుతున్నాయా? లేట్ చేయకుండా ఆస్పత్రికి వెళ్తే బెటర్! - SWEAT IN SLEEP CAUSES

-నిద్రలో చెమటలు పట్టడానికి కారణాలు ఇవేనట -వివిధ రకాల అనారోగ్యాలకు ఇదే సంకేతమట!

Sweat in Sleep Causes
Sweat in Sleep Causes (Getty Images)

By ETV Bharat Health Team

Published : 5 hours ago

Sweat in Sleep Causes:వాతావరణం వేడిగా ఉండడం, ఇంట్లోకి గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం.. ఇలాంటి సమయాల్లో చెమటలు పట్టడం సర్వసాధారణం. అయితే కొంతమందికి మాత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాత్రుళ్లు నిద్రలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇది చిన్న సమస్యే కదా అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వివిధ రకాల అనారోగ్యాలకు ఇదే సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సమస్య తీవ్ర రూపం దాల్చకముందే.. వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమటలు ఎందుకు పడతాయి? ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైపర్‌ థైరాయిడిజం:జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వర్తించడంలో థైరాయిడ్‌ గ్రంథి సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఇది అత్యంత చురుగ్గా మారినప్పుడు హైపర్‌ థైరాయిడిజం సమస్య బారిన పడతామని.. ఫలితంగా శరీరం వేడికి తట్టుకోలేక చెమటలు పడుతుంటాయని అంటున్నారు. 2017లో European Thyroid Journal ప్రచురితమైన "Thyroid-Associated Symptoms in Patients with Hyperthyroidism" అనే అధ్యయనంలో తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఒత్తిడి/ఆందోళన:మనం ఒక్కోసారి అకస్మాత్తుగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతాం. అయితే, వాటి ప్రభావం మెదడు, శరీరంపై పడి నిద్రలో చెమటలు పడతాయని నిపుణులు అంటున్నారు.

మానసిక రుగ్మతలు:కొన్ని రకాల మానసిక రుగ్మతలు కూడా నిద్రలో చెమటలకు కారణం అవుతుందని అంటున్నారు. ఈ రుగ్మతలు ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన ఒత్తిడి, ఆందోళన మొదలై నిద్రలో చెమటలు పడతాయని అంటున్నారు.

మెనోపాజ్:40 దాటిన మహిళల్లో రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయా? అయితే, వీరంతా మెనోపాజ్‌కు చేరువవుతున్నారనడానికి సూచనగా భావించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్‌ఐవీ: టీబీ, హెచ్‌ఐవీ, లుకేమియా వంటి సమస్యలు ఉన్నవారిలోనూ అకస్మాత్తుగా శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంటుంది. దీని వల్ల కూడా రాత్రుళ్లు చెమటలు పడతాయని నిపుణులు అంటున్నారు.

హైపర్‌టెన్షన్‌: హైపర్‌టెన్షన్‌, యాంటీ రెట్రోవైరల్స్‌, యాంటీ డిప్రెసెంట్స్‌ మందులు వాడడం వల్ల చెమట గ్రంథుల్ని నియంత్రించే మెదడు భాగాలపై ప్రతికూల ప్రభావం పడి నిద్రలో చెమటలు పడతాయని చెబుతున్నారు.

కెఫీన్‌: ఇంకా కెఫీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

  • మెనోపాజ్‌కు దగ్గరవుతున్న, మెనోపాజ్‌లో దశలో ఉన్న మహిళలు ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే రోజువారీ ఆహారంలో మసాలా, కారం వంటివి వాటిని దూరం పెట్టాలని సూచిస్తున్నారు.
  • బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమట సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం నిపుణుల సలహా మేరకు పోషకాహారం తీసుకుంటూనే.. వ్యాయామాలు చేయాలని సలహా ఇస్తున్నారు.
  • ముఖ్యంగా కెఫీన్‌, మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాక్లెట్‌.. వంటి వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిదని చెబుతున్నారు.
  • కొందరిలో కొన్ని రకాల మందులు వాడితే చెమటలు పడుతుంటాయి. అలాంటి వారు వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర మందులేవైనా వాడచ్చేమో నిపుణుల్ని అడిగి సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు.
  • మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకునేందుకు నచ్చిన పనులు చేయాలని నిపుణులు అంటున్నారు. ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిన్న బెల్లం ముక్కతో షుగర్ కంట్రోల్​లో ఉంటుందట! మరి చక్కెరకు బదులుగా వాడొచ్చా?

చలికాలంలో షుగర్ పెరుగుతుందా? ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే అదుపులో ఉంటుందట!

ABOUT THE AUTHOR

...view details