Precautions to be taken by Pregnant Women:గర్భం ధరించామని తెలియగానే కొంతమంది తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకాడుతుంటారు. మరికొద్దిమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యే దాకా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీ అనేది సమస్య కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని.. అయితే అందుకు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
మన శరీరంలో ప్రొజెస్టరాన్ హార్మోన్ గర్భాశయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో(National Institute of Health రిపోర్ట్) గర్భాశయ ముఖద్వారాన్ని బిగుతుగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఫలితంగా మెట్లెక్కడం, చిన్నపాటి వ్యాయామాలు, ప్రయాణాలు.. వంటివి చేయడం వల్ల లోపల బిడ్డకు ఎటువంటి ఇబ్బందీ కలగదని చెబుతున్నారు నిపుణులు. అయితే గర్భిణుల్లో ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొందరు యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా కాబోయే అమ్మలు మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ప్రముఖ యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణతీ రెడ్డి చెబుతున్నారు.
గర్భిణులు తినే ఆహారం పుట్టే పిల్లలకు ప్రమాదమా? - ఏం తింటే చిన్నారులు ఆరోగ్యంగా పుడతారో తెలుసా?
గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:
- గర్భం ధరించిన వారిలో వాంతులు, వికారం.. వంటి లక్షణాలు నెలల పాటు కొనసాగుతాయని.. అందుకే ప్రయాణాల్లో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ ప్రణతీ రెడ్డి సూచిస్తున్నారు.
- ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, మందులు.. వంటివన్నీ ఎప్పుడూ బ్యాగ్‌లో ఉంచుకోవాలని.. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చని వివరిస్తున్నారు.
- వాటర్ బాటిల్‌ను కూడా వెంట ఉంచుకోవడమూ మంచిదని.. అలాగే మధ్యమధ్యలో వీలుంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పడిపోకుండా ఉంటాయంటున్నారు. ఇక ఫ్రూట్ జ్యూస్‌లు తాగాలనుకున్నవారు ఇంటి నుంచే తయారుచేసి తీసుకెళ్లడం మంచిదంటున్నారు.
- ప్రయాణాల్లో బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా, సౌకర్యవంతంగా ఉండే వస్త్రాలు ధరించడం మంచిదని నిపుణులు అంటున్నారు. తద్వారా కూర్చున్నా ఇబ్బందిగా అనిపించదని.. అలాగే చెప్పుల విషయంలోనూ ఫ్లాట్స్‌ని ఎంచుకుంటే కంఫర్టబుల్‌గా నడవడానికి వీలవుతుందని సూచిస్తున్నారు.