What are the Foods to Avoid Keep Liver Healthy:మన శరీర అవయవాల్లో ముఖ్యమైనది, పెద్దది కాలేయం. ఈ అవయవం మూడు వంతుల వరకు పాడైపోయినా.. తిరిగి దానంతంట అదే బాగు చేసుకోగలదు. పావు వంతు బాగున్నా సరే.. తనను తాను తిరిగి నిర్మించుకోగలదు. ఇలాంటి ముఖ్యమైన అవయవం దెబ్బతినడానికి చాలా మంది మద్యపానం, ధూమపానం కారణం అని అనుకుంటారు. ఇవీ రెండూ కారణాలైనప్పటికీ.. మనం రోజు తీసుకునే అనేక ఇతర ఆహార పదార్థాలు.. వాటికన్నా ఎక్కువగా కాలేయాన్ని ప్రభావితం చేస్తాయని.. అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందేనని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్: శీతల పానియాలు తాగడం వల్ల కాలేయంత్వరగా చెడిపోతుందని వైద్యులు చెబుతున్నారు. చక్కెర, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కాలేయానికి మంచిది కాదని.. ఇదంతా లివర్లో పేరుకుపోయి కొవ్వుగా మారుతుందన్నారు. ఫలితంగా కాలేయ పనితీరు మందగిస్తుందని అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుందని.. దీంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు.
కొవ్వు పదార్థాలు :కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుందట. వెన్న, నెయ్యి, చీజ్, రెడ్ మీట్ వంటి ఆహారాల్లో కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారం:వేపుళ్లతో పాటు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు అంటున్నారు. రంగు, రుచి కోసం కలిపే ఫుడ్ కలర్స్తోనూ ప్రమాదమేనట. దీంతో పాటు చక్కెర, శీతల పానీయాలలో ఉపయోగించే ప్రాసెసింగ్ పదార్థాలు ఆరోగ్యానికి హానికరం చేస్తాయని వివరిస్తున్నారు.
రసాయనాలతో పండించిన ఆహారం:కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోకపోవడమే మంచిదట. సేంద్రీయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.