Weight Loss Tips After 40 Years Old:40 ఏళ్లు దాటాక శరీర బరువును తగ్గించుకోవాలంటే ప్రధానంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ టి లక్ష్మీ కాంత్ చెబుతున్నారు. ఆహారంలో ఎక్కువ భాగం పళ్లు, కూరగాయలను తినడం మంచిదని అంటున్నారు. మాంసం, పాలు, డెయిరీ ఉత్పత్తులు, ధాన్యపు ఆహారాలతో పోలిస్తే పళ్లు, కూరగాయల్లో ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయని తెలిపారు. పళ్లు, కూరగాయలను తక్కువ మోతాదులో తీసుకున్నా.. పొట్ట నిండిన సంతృప్తి కలుగుతుందట.
చక్కెర, కొవ్వు, పిండి పదార్థాలు ఉన్న చిరుతిళ్ల కంటే తాజా పళ్లు తీసుకోవడం మంచిందని చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఓట్స్, చిరు ధాన్యాలు, పళ్లతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల మధ్యాహ్నం భోజన సమయంలో మితిమీరిన ఆకలి వేయకుండా ఉంటుందని సలహా ఇస్తున్నారు. చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం.. లేదా తరచుగా స్నాక్స్ తీసుకోవడం ద్వారా రోజంతా ఆకలి వేయకుండా నివారించుకోవచ్చంటున్నారు. అలాగే మనం తినే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మధ్యాహ్నం 3 గంటలోపు తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. బరువు తగ్గాలని అనుకునేవారు తప్పనిసరిగా ఉదయం పూట అల్పాహారం మానకూడదని చెబుతున్నారు.
"వయసు పెరిగేకొద్దీ.. మన జీర్ణక్రియ శక్తి తగ్గుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం శరీరంలో పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. వయసు పెరిగే సమయంలో కండరాల సాంద్రతను పెంచుకోవడం వల్ల బరువు అంత సులభంగా పెరగరు. ఇందుకోసం వారంలో 5రోజులు సుమారు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీంతో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తక్కువగా తాగినప్పుడు.. దాహం వేసినా ఆకలిగా భావించి ఆహారం తింటాం. అందుకే ఎక్కువగా నీటిని తాగాలి. సాయంత్రం సమయాల్లో ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు."
--డాక్టర్ టి లక్ష్మీ కాంత్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో చురుకుదనం తగ్గుతుందని.. దీంతో మునపటి కంటే తక్కువ కేలరీలు సరిపోతాయని చెబుతున్నారు. ఆహారం తగ్గించుకోవాలని అనుకునేవారు రోజంతా ఏం తింటున్నామనేది రాసుకోవడం మంచిదట. అలాగే రోజులో తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినే ప్రయత్నం చేయాలని వివరిస్తున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు దానిపై ఏకాగ్రత ఉండాలని... అలా కాకుండా ఏదో ఒక పని చేస్తూ తినడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారని వివరిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఆల్కహాల్ సైతం బరువు పెరిగేలా చేస్తుందట. మద్యం ఎక్కువగా తాగడం వల్ల ఆకలి పెరిగి.. ఆహారం అధికంగా తీసుకోవాల్సిన అవసరం పెరుగుతుందని వివరిస్తున్నారు.