Alternative Flours Instead of Refined Flour for Baking Purpose:చాలా మందికి బేకరీ ఐటెమ్స్ అంటే ఇష్టం. కేక్స్, కుకీలు, మఫెన్స్ అంటూ రకరకాల పదార్థాలు తింటుంటారు. కేవలం బేకరీలో మాత్రమే కొనుకుండా.. ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకుంటారు. అయితే బేకరీ పదార్థాల్లో చాలా వరకు మైదానే వాడుతుంటారు. కానీ.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. అదేసమయంలో మైదా పిండికి బదులుగా మరికొన్ని వాడుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గోధుమ పిండి: బేక్ చేసేందుకు మైదా బదులు గోధుమ పిండి వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఎందుకంటే మైదాతో పోలిస్తే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహం తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. అంతేకాకుండా మైదాతో పోలిస్తే వీటితో చేసిన వంటలు రుచికరంగా కూడా ఉంటాయట.
బాదం పిండి:బాదం పప్పుల నుంచి తయారు చేసిన పిండి కూడా మైదాకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చుంటున్నారు నిపుణులు. ఇది గ్లూటెన్ రహితమే కాకుండా.. ఇందులో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 2017లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్(Journal of Food Science)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బేకింగ్ కోసం మైదా పిండికి బదులుగా బాదం పిండిని ఉపయోగించడం వల్ల వాటి రుచి మరింత పెరిగిందని.. ఆరోగ్యపరంగా కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ హ్యూమన్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ డాక్టర్ మార్గరెట్ డి. ఓ'కానర్ పాల్గొన్నారు.
ఓట్స్ పిండి: మైదా ప్లేస్లో ఓట్స్ పిండిని కూడా చేర్చుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదంటున్నారు.