Warning Signs of Various Diseases:మన శరీరం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందని నిపుణులు అంటుంటారు. తనను తాను సురక్షితంగా ఉంచుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఏవైనా జబ్బులు తలెత్తే అవకాశం ఉంటే ముందే సంకేతాలు, లక్షణాల రూపంలో మనల్ని హెచ్చరిస్తుంది. వాటిని మనం సరిగ్గా గుర్తించగలిగితే తీవ్ర సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాంతక గుండె పోటు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ముందు హెచ్చరికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పక్షవాతం
- అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలు మొద్దుబారడం
- ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం.
- ఉన్నట్లుండి మాట తడబడుతూ అంతా అయోమయంగా అనిపించటం. ఎదుటివాళ్లు చెప్పేది అర్థం కాకపోవటం.
- అకస్మాత్తుగా ఒక కంట్లో గానీ రెండు కళ్లలో గానీ చూపు తగ్గిపోవడం
- హఠాత్తుగా నడకలో తడబాటు, తల తిరుగుతున్నట్టు, పట్టు తప్పి తూలి పడిపోవడం
- ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి రావడం.
గుండెపోటు
- ఛాతీ బిగపట్టినట్టు, లోపలేదో నొక్కుతున్నట్టు అనిపించటం. నొప్పి పుట్టటం. ఇవి కొన్ని నిమిషాల సేపు అలాగే ఉండి పోవచ్చు. లేదూ వస్తూ పోతుండొచ్చు.
- చేతుల్లో ముఖ్యంగా ఎడమ చేయి, భుజంలో నొప్పి. మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించడం.
- శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఆయాసం రావడం.
- తల తేలిపోతున్నట్టు, వాంతీ, వికారంగా అనిపించటం.
- చెమటలు పట్టడం, నిస్సత్తువ.
- ఈ లక్షణాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్‌లో సైతం వెల్లడైంది. అయితే, అందరికీ అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. తీవ్రత కూడా ఒకేలా ఉండకపోవచ్చని.. కొందరికి ఎలాంటి లక్షణాలూ లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటు రావొచ్చని అంటున్నారు.
క్యాన్సర్
- కారణం లేకుండా వేగంగా 5, అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గడం.
- ఆకలి మందగిచి ఎప్పుడూ కడుపు నిండిన భావన ఉండటం. ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం.
- తీవ్ర నిస్సత్తువ ముఖ్యంగా క్యాన్సర్ వృద్ధి చెందుతున్నప్పుడు తీవ్ర అలసట. విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోవడం.
- ఎముక, వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావొచ్చు. విడవకుండా తలనొప్పి, వెన్నునొప్పి కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావొచ్చు.
- మలబద్ధకం, అతిసారం.. మలం పరిమాణంలో మార్పులు, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, తరచూ మూత్రం రావటం.
- నోట్లో చాలాకాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు. జననాంగాల్లో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు .
- మూత్రంలో, మలంలో, కళ్లలో రక్తం పడటం.
- మెడ, చంకల్లో లింప్ గ్రంథులు ఉబ్బటం. ఇవి రెండు వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి.
- రొమ్ముల్లో మార్పులు, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావం.
- విడవకుండా దగ్గు, ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవటం, నిస్సత్తువ, ఆయాసం వంటివి కనబడితే ఆలస్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా జ్వరం తగ్గకపోవటం కారణమని.. క్యాన్సర్ ఇతర చోట్లకు వ్యాపించినపుడు విడవకుండా జ్వరం వేధిస్తుంటుందని చెబుతున్నారు. ఇలాంటి జ్వరాలు పగటిపూట పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయని.. రోజులో ఒకే సమయంలో తీవ్రమవుతుంటాయని వివరిస్తున్నారు.