Vegan Diet is During Menopause Phase : ప్రస్తుత కాలంలో చాలా మంది వీగన్ డైట్ ఫాలో అవుతున్నారు. నాన్‌వెజ్, గుడ్లు, పాలు, పాలపదార్థాలతోపాటు తేనె వంటి ఇతర పదార్థాలూ ఈ డైట్లో ఉండవు. అయితే, ఇది ట్రెండా.. ఆరోగ్యమా.. అన్నది కాసేపు పక్కనపెడితే.. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వృక్షసంబంధిత ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఈ దశలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు 'డాక్టర్ లతాశశి' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
వేడి ఆవిర్లు.. ఇదే మెనోపాజ్ దశలో మహిళలను వేధించే ప్రధాన సమస్య. ఒంట్లో నుంచి సెగలొస్తున్నట్లే ఉంటుంది. సరిగా ఊపిరి అందదు. చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. మెనోపాజ్‌కి ముందు, తర్వాత తలెత్తే ఈ సమస్యని తట్టుకోలేక.. ఎక్కువ మంది డిప్రెషన్‌కీ లోనవుతారు. అందుకే కొంతమంది హార్మోన్ చికిత్సల్నీ ఆశ్రయిస్తారు.
అయితే.. ఆహారంలో మార్పులు, వ్యాయామంతోఈ సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చట. ముఖ్యంగా ఆ సమయంలో నాన్‌వెజ్ తగ్గించి శాకాహారం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని గతంలో పరిశోధనలు వెల్లడించాయి. తాజాగా అమెరికాలోని 'ఫిజీషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్' అనే సంస్థ చేపట్టిన పరిశోధనలోనూ ఇదే విషయం తేలింది.
పరిశోధన వివరాలు..
రీసెర్చ్‌లో భాగంగా.. వేడి ఆవిర్లతో ఇబ్బందిపడుతోన్న కొందరిని ఎంపికచేసి 4 వర్గాలుగా విభజించారు. వాళ్లకి 12 వారాలపాటు ఆహారాన్ని ఇచ్చి గమనించారు. ఒక గ్రూప్‌కి ఎప్పట్లానే శాకాహారం, మాంసాహారం అన్నీ తీసుకోమన్నారు. మరో 3 విభాగాలకు శాకాహారాన్ని మాత్రమే ఇచ్చారు. వీళ్లలో ఒక గ్రూప్‌కి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, సోయా, క్వినోవా, నట్స్, తృణధాన్యాలు.. వంటివీ; రెండో గ్రూప్‌కి సాధారణ శాకాహారాన్నీ ఇచ్చారు. మూడో గ్రూప్ సభ్యులకు ప్రాసెస్ చేసినవీ, పండ్ల రసాలూ అందించారు. చిత్రంగా ఈ 3 విభాగాల్లోని మహిళలూ సుమారు నాలుగు కిలోల బరువు తగ్గారట. 92 శాతం వేడి ఆవిర్లు (హాట్ ఫ్లాషెస్) కూడా తగ్గాయట. ఇక నాన్‌వెజ్ తీసుకున్నవాళ్లలో ఏ మార్పూ లేదు.
ఈ పరిశోధనను బట్టి మెనోపాజ్‌లో ఉన్న లేదా దాటిన మహిళలు శాకాహారులుగా మారడం మంచిదే అని తెలుస్తోంది. వెజ్‌లో వివిధ రకాలు ఉండటంవల్ల పొట్టలో మైక్రోబయోమ్ మెరుగవుతుంది. దీనివల్ల గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుంది. అలాగే పీచు ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉండటంతో బరువు కూడా అదుపులో ఉంటుంది.
కారణాలు ?
మెనోపాజ్‌లోఈస్ట్రోజన్ స్థాయులు తగ్గడం వల్ల వేడి ఆవిర్లు, నిద్రలేమి.. వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే.. వాల్‌నట్స్, సోయా, అవిసెలు.. వంటి వాటిల్లోని ఫైటోఈస్ట్రోజన్స్ అచ్చం ఈస్ట్రోజన్‌లా పనిచేస్తాయి. దాంతో ఆయా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
సోయా.. ఫైటోఈస్ట్రోజన్స్‌కి మంచి వనరు. అదీ పులియబెట్టిన మిసో, టెంపె.. వంటివైతే అందులోని సహజ పదార్థాలన్నీ విభజితమై బాడీ త్వరగా శోషించుకుంటుంది. అందుకే మెనోపాజ్‌కి చేరువలో ఉన్నప్పుడే డైట్లో ముడిధాన్యాలు, బీన్స్, పప్పుధాన్యాలతోపాటు అవిసెలు, సోయా ఉత్పత్తులైన గ్రాన్యూల్స్, చంక్స్, టోఫు, టెంపె.. వంటివి తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే ఫైటోన్యూట్రియంట్లు పొట్టలోని బ్యాక్టీరియా సహాయంతో ఈస్ట్రోజన్‌లా మారతాయి.
మెనోపాజ్‌లో డైట్లో మార్పు చేయాలనుకుంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!
- మాంసాహారంలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. అది మానేసేటప్పుడు.. శాకాహారంలో ప్రొటీన్ వనరులైన సోయామిల్క్, టోఫు.. వంటివి తరచూ తీసుకోవాలి. అయితే.. మన శరీర బరువును బట్టి ప్రొటీన్ అవసరమవుతుంది. కాబట్టి, మెనోపాజ్‌లో ప్రతి కిలోకి సుమారు ఒక గ్రా. ప్రొటీన్ తీసుకోవాలి.
- ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గింజల్నీ, నట్స్‌నీ డైట్లో చేర్చుకోవాలి. చియా, బాదం, అవిసెలు, వాల్‌నట్స్.. వంటి వాటివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవీ మోతాదులో అంటే- 35గ్రాములకు మించకుండా తీసుకోవాలి.
- ఐరన్, కాల్షియం కోసం పాలకూర, బచ్చలి, పప్పుధాన్యాలు, ఫోర్టిఫైడ్ సెరియల్స్ తినాలి. విటమిన్-సి ఎక్కువగా ఉన్న పండ్లు తింటే పోషకాలు అందుతాయి.
- క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీలు ఈస్ట్రోజన్ స్థాయుల్ని పడిపోకుండా చేస్తాయి. అలాగే ఓట్స్, చిరుధాన్యాలు, ముడిధాన్యాలు, ఆకుకూరల్లోని మెగ్నీషియం, విటమిన్-బి6 కూడా ఈ హార్మోన్ శాతాన్ని తగ్గనివ్వవు.
- అయితే.. విటమిన్-బి12 శాకాహారంలో లభించదు. ఇంకా విటమిన్-డి, కాల్షియం.. వంటివి కూడా ఆహారం ద్వారా పూర్తిస్థాయిలో అందకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ సప్లిమెంట్స్ లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదా కాల్షియం కోసం తక్కువ కొవ్వు ఉన్న డెయిరీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు.
- ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే కొవ్వుకణాలు ఈస్ట్రోన్ అనే స్పెషల్ హార్మోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ సమస్యల్ని అధిగమించవచ్చని డాక్టర్ లతాశశి అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం!
పీరియడ్స్ నొప్పులు తగ్గాలా? ఈ టిప్స్ పాటిస్తే నెలసరిలోనూ ఫుల్ యాక్టివ్!