Parenting Tips to Change Rude Behaviour in Childrens : కొంతమంది పిల్లలు చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఏ విషయంలోనైనా తమకు నచ్చినట్లుగా జరగకపోతే పేరేంట్స్తో అయినా, ఇంకెవరితో అయినా మొరటుగా ప్రవర్తిస్తారు. కఠినమైన పదజాలంతో దూషించడం లేదా వస్తువులను విసిరేయడం, అవతలి వ్యక్తులపై దాడులు చేయటం వంటివి చేస్తారు. ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వారి వైఖరి మాత్రం మారదు. రాను రాను మారుతున్న పిల్లల వైఖరితో ఒక్కోసారితల్లిదండ్రులు(Parents) కూడా సహనం కోల్పోయి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు.
వారిని సరైన మార్గంలో నడిపించడం కోసం కొట్టడం లాంటివి కూడా చేస్తారు. అయినా పిల్లల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాదు. ఇంకా ఇలా చేయడం వల్ల పిల్లల ప్రవర్తన మరింత దిగజారుతుంది తప్ప, వారి వైఖరిలో మార్పు కనిపించదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే నో టెన్షన్. మొండిగా ప్రవర్తించే పిల్లల వైఖరిని మార్చడమే కాకుండా వారిని సరైన దారిలో నడిపించడానికి నిపుణులు కొన్ని సలహాలను సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సరైన కారణాన్ని గుర్తించండి :పిల్లలు మొండిగా ప్రవర్తించడానికి కారణం.. చాలా సందర్భాల్లో వారు తమలోని కొన్ని భావోద్వేగాలను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడమే. దీంతో వారికి తమ బాధ ఎలా వ్యక్తపరచాలో తెలియక మొండి పిల్లలుగా ప్రవర్తిస్తారు. అటువంటి సందర్భాలలో తల్లిదండ్రులు వారిని లోతుగా పరిశోధించాలి. వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సరైన కారణాన్ని కనుగొని అందులో నుంచి పిల్లలను బయట పడేలా చూడాలి.
మంచి మాటలు నేర్పించడం :పిల్లలు వారి తోబుట్టువులు లేదా వారి తల్లిదండ్రులతో మొరటుగా మాట్లాడుతూ ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు వారు ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పదజాలం ఉపయోగించాలి అనే విషయాలను వారికి నేర్పించాలి. ఏ రకంగా మాట్లాడితే వారు అనుకున్నది నెరవేరుతుందో తెలియజెప్పాలి. ఇది వారి భావోద్వేగాలను సరిగా కమ్యూనికేట్ చేయడానికి, తమను తాము మార్చుకోడానికి సహాయపడుతుంది. ఇతరుల పట్ల జాలి, దయ కూడా నేర్పుతుంది.