Precautions for Reduce Chest Burning :సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పడు అన్నవాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుంది. ఆ ఆహారంతోపాటు పొట్టలో ఏర్పడే ఆమ్లం తిరిగి పైకి రాకుండా.. అన్నవాహికలో ఒక కవాటం ఉంటుంది. ఏదైనా కారణం చేత.. ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు లేదా వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని రావడం మొదలవుతుంది. దీంతో తేన్పులు, ఛాతిలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. రాకేష్.
ఈ సమస్యనే.. వైద్య పరిభాషలో "గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్" అంటారు. దీన్నే వాడుక భాషలో 'జీఈఆర్డీ' అని పిలుస్తారు. ఛాతిలో మంట, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు.. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, స్థూలకాయం, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు డాక్టర్ రాకేష్. అలాగే.. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తరచుగా తీసుకోవడం, టైమ్‌కి భోజనం చేయకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి లోనుకావడం ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసి జీఈఆర్డీకి కారణమవుతాయంటున్నారు.
అంతేకాదు.. పొట్టలోని ఆమ్లం తరచుగా ఆహారనాళంలోకి రావడం వల్ల అన్నవాహిక దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అయి సంబంధిత వైద్యుడిని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదంటున్నారు. అలాగే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
- ఛాతిలో మంట, గ్యాస్, అల్సర్ వంటి వాటికి దూరంగా ఉండాలంటే.. ఆహార పరమైన జాగ్రత్తలతోపాటు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు. NIH పరిశోధకుల బృందం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. (News in Health రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
- మొదటగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటెన్ చేయాలి.
- ముఖ్యంగా మసాలా, కారం, ఆయిల్ ఐటమ్స్, జంక్ ఫుడ్, పీజా, బర్గర్, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాలి.
- అదేవిధంగా.. వేళకు భోజనం చేయాలి. మరీ ఎక్కువగా తినొద్దు. ముఖ్యంగా ప్రశాంతంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి.
- తిన్న వెంటనే పడుకోవద్దు. కనీసం గంటైనా విరామం ఉండేలా చూసుకోవాలి.
- ఒత్తిడి, మానసిక ఆందోళనలు మీ దరిచేరకుండా జాగ్రత్త పడాలి.
- అధిక బరువు ఉన్నవారు.. బరువు అదుపులో ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి.
- వీటితో పాటు మద్యపానం, ధూమపానం వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్ రాకేష్.