Teenage Pregnancy Risks:బాల్య వివాహాలు, తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు.. ఇలా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి (టీన్ ప్రెగ్నెన్సీ) కారణాలు అవుతున్నాయి. అయితే టీనేజ్లోనే గర్భధారణ వల్ల తల్లితో పాటు బిడ్డకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా బాల్య వివాహాల్ని నిర్మూలించాలని అంటున్నారు. దీంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యం, టీన్ ప్రెగ్నెన్సీ వంటి విషయాలపై చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించాలని సలహా ఇస్తున్నారు.
టీన్ ప్రెగ్నెన్సీ అంటే?
13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని టీనేజ్ అంటారు. ఈ సమయంలో గర్భం ధరించిన అమ్మాయిల్ని టీన్ ప్రెగ్నెంట్’గా పరిగణిస్తారు. మన దేశంలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏటా సుమారు 1.6 కోట్ల మంది బాలికలు చిన్న వయసులోనే (15-19) తల్లులవుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
టీనేజ్లో గర్భం దాల్చడం వల్ల చాలా శారీరక, మానసిక సిద్ధం కాకపోవడం వల్ల అనేక మార్పులు జరుగుతుంటాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ చెబుతున్నారు. ముఖ్యంగా గర్భాశయం లాంటి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సిద్ధం కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంకా కొందరిలో అయితే, అబార్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొందరిలో ఇన్ఫెక్షన్లు సోకి సైడ్ ఎఫెక్ట్ వస్తాయని తెలిపారు. ఇంకా పిండం ఎదుగుదల సరిగ్గా లేక మిస్ క్యారేజ్, నెలల నిండకుండానే ప్రసవం జరుగుతుందని వెల్లడిస్తున్నారు. కొందరిలో 9నెలల వచ్చి నొప్పులు వస్తున్నా.. కాన్పు ఆలస్యం అవతుందంటున్నారు.