Sleep Deprivation Can Cause Weight Gain :చాలా మంది నిద్ర విషయంలో అజాగ్రత్తగా ఉంటుంటారు. ముఖ్యంగా నేటి టెక్నాలజీ యుగంలో ఫోన్లు, డిజిటల్ పరికరాల వాడకంతో నిద్ర సమయం చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. మరి, మీరు కూడా రోజూ నైట్ టైమ్ సరిగ్గా నిద్ర పోవట్లేదా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తగినంత నిద్ర పోని వ్యక్తులు, నిద్రలేమితో బాధపడేవారు బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందట. పలు పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. మరి, నిద్రలేమి బరువును ఎలా ప్రభావితం చేస్తుంది? సరైన నిద్రలేకపోతే తలెత్తే మరికొన్ని అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంలో మంచి నిద్ర కీలకమైన పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ నిద్ర ఉంటే నెగిటివ్‌గా, సరైన నిద్ర ఉంటే పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోవడం శారీరక బరువు పెరుగుదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. కాబట్టి, నేటి రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారు ఫుడ్ కంట్రోల్, వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు.
బరువును ఎలా ప్రభావితం చేస్తుందంటే?తగినంత నిద్రలేకపోవడం వల్ల బాడీలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది బరువు పెరగడాన్ని బాగా ప్రోత్సాహిస్తుందంటున్నారు. ఎందుకంటే కార్టిసాల్‌ను బరువును పెంచే ప్రధాన హార్మోన్‌గా చెప్పుకుంటుంటారు. కార్టిసాల్ ఒక స్ట్రెస్ హార్మోన్. మనం సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు అధికమవుతాయి. ఫలితంగా బాడీలో హర్మోన్ అసమతుల్యతలు ఏర్పడి బరువుపెరగడానికి దారితీస్తుందంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్‌లోనూ రోజూ తగినంత నిద్రపోకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుందని వెల్లడైంది. డైలీ 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులలో ఊబకాయం ముప్పు ఎక్కువని కనుగొన్నారు. అందుకు సంబంధించినరిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.