తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్​: స్మార్ట్​ఫోన్ ఎక్కువగా వాడితే - తొందరగా ముసలివారు అవుతారట! ఎలానో తెలుసా? - Phone Usage Effects On Skin - PHONE USAGE EFFECTS ON SKIN

Side Effects Of Mobile Usage : ప్రస్తుత రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్​ఫోన్​లను వాడుతున్నారు. నిజానికి స్మార్ట్​ఫోన్లు ఎన్నో అవసరాలను తీర్చుతున్నాయి. కానీ, వాటిని అతిగా ఉపయోగించడం వల్ల అంతే మొత్తంలో నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఫోన్​ను ఎక్కువగా వాడడం వల్ల త్వరగా ముసలివారు అవుతారట! అదెలాగో మీరే చూడండి.

Side Effects Of Mobile Usage
Phone Excessive Usage Affects On Skin (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 3:49 PM IST

Phone Excessive Usage Effects On Skin Health :నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్​ఫోన్ అరచేతిని వీడని ఆభరణమై పోయింది. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ అది లేకుండా అరక్షణం గడపలేని పరిస్థితి. అవసరం దగ్గర నుంచి ఎంటర్​టైన్​మెంట్ దాకా ఏది కావాలన్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే! అయితే, ఫోన్​తో అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ.. అంతే మొత్తంలో ఆరోగ్యానికి హాని చేసే నష్టాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్​ను(Smartphone) ఎక్కువగా వాడడం చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి అందాన్ని తగ్గిస్తుందంటున్నారు. అలాగే.. వివిధ చర్మ సంబంధిత సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి దారితీస్తుందంటున్నారు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృద్ధాప్య ఛాయలు: సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు చర్మానికి ఏ విధంగా హాని చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అదే మాదిరిగా స్మార్ట్​ఫోన్ నుంచి వెలువడే హై ఎనర్జీ విజిబుల్‌ లైట్‌... అదేనండి నీలికాంతి కూడా చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. యూవీ కిరణాలకంటే ఎక్కువగా చర్మ లోతుల్లోకి చొచ్చుకొని పోయే సామర్థ్యం ఈ కాంతికి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. నీలి కాంతి చర్మ కణాలతోపాటు సాగే గుణానికి కారణమైన కొల్లాజెన్‌నీ దెబ్బతీసి, త్వరగా వృద్ధాప్యఛాయలు వచ్చేలా చేస్తుందంటున్నారు.

2019లో "Journal of Investigative Dermatology"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మొబైల్​ నుంచి వెలువడే నీలి రంగు కాంతి మానవ చర్మ కణాలపై ప్రభావం చూపి కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్​ఏలోని 'యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్'కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ J. Dirk ELDREDGE పాల్గొన్నారు. స్మార్ట్​ఫోన్​ను అతిగా వాడడం వల్ల దాని నుంచే వెలువడే బ్లూ లైట్ కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించి త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు.

మచ్చలు: కొందరిలో బుగ్గలు, ముక్కుమీద నల్లని మచ్చలు వస్తుంటాయి. అందుకు అతిగా ఫోన్ వాడడం కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెలనిన్‌ ఉత్పత్తి పెరిగి ఈ పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు.. చర్మం పొడిబారి చిట్లినట్లుగా అవుతుందంటున్నారు. దీంతో యాక్నే, ఎగ్జిమా వంటివి రావడానికి కూడా దారితీస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్​ఫోన్​ వాడకాన్ని తగ్గించడం మంచిదంటున్నారు. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా చర్మ సౌందర్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చంటున్నారు. అవేంటంటే..

ఫోన్​ అడిక్షన్​తో బాధపడుతున్నారా? ఈ సింపుల్​ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

  • రోజూ రెండు పూటలా ఫేస్ వాష్ చేసుకోవడం, మాయిశ్చరైజర్‌ రాయడం తప్పనిసరి చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే వాడే క్రీముల్లో విటమిన్‌ సి, ఇ, నియాసినమైడ్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
  • అలాగే.. మీ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో యూవీఏ, యూవీబీలతోపాటు నీలికాంతి నుంచి రక్షణనిచ్చే బ్రాడ్‌స్పెక్ట్రమ్‌ సన్‌స్క్రీన్‌ని తప్పక చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. దానిలో జింక్‌ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్, ఐరన్‌ ఆక్సైడ్స్‌ వంటివి ఉంటే ఇంకా మంచిదంటున్నారు.
  • చేతిలోకి ఫోన్‌ తీసుకున్న ప్రతిసారీ టైమ్​ని చూసుకోండి. 20 నిమిషాలు అవుతోంది అనిపించగానే పక్కన పెట్టడానికి ట్రై చేయండి. వీలుంటే కాస్త దూరాన ఉన్న ఏదైనా వస్తువును తదేకంగా చూస్తే మేలు అంటున్నారు. ఇలా చేయడం ద్వారా చర్మంతోపాటు కళ్లకీ హాని తగ్గుతుందని చెబుతున్నారు.
  • అదేవిధంగా స్మార్ట్​ఫోన్​కు స్క్రీన్ ప్రొటెక్టర్​ వేయించుకోవడం మంచిది. దీని వల్ల ఫోన్ కింద పడ్డప్పుడు స్క్రీన్ పగలకుండా ఉండడమే కాదు.. నీలి కాంతి ప్రభావాన్ని తగ్గించడంలోనూ అది చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

హెచ్చరిక : మహిళల గర్భాశయంపై మొబైల్​ ఎఫెక్ట్ - ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details