Is it Good to Rubbing Ice on Face? :ముఖం అందంగా మెరుస్తూ ప్రకాశవంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. ఇంట్లో నేచురల్ ఫేస్‌ప్యాక్స్, పార్లర్‌లో ఫేషియల్స్ చేయించుకుంటారు. అయితే, కొంతమంది గ్లోయింగ్ స్కిన్కోసం ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి బ్యూటీ టిప్స్‌లో ముఖానికి ఐస్ అప్లై చేసుకోవడం కూడా ఒకటి. అయితే, ఇలా ముఖానికి ఐస్ రుద్దితే ఏమవుతుంది ? అందం కోసం ఇలాంటి చిట్కాలు పాటించడం మంచిదేనా ? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చైనీస్ బ్యూటీ టిప్ :ప్రతిరోజు రాత్రి, మేకప్ వేసుకునే ముందు ముఖానికి ఐస్ రుద్దితే కొన్ని ప్రయోజనాలుంటాయని ప్రముఖ సౌందర్య నిపుణురాలు 'డాక్టర్ శైలజ సూరపనేని' చెబుతున్నారు. కానీ, ముఖానికి ఐస్ రుద్దితే మంచిదని తెలిపే శాస్త్రీయ ఆధారాలైతే ఏమీ అందుబాటులో లేవని అంటున్నారు. ఇలా ముఖానికి ఐస్ అప్లై చేసుకోవడం చైనీస్ స్కిన్‌కేర్‌లోఒక భాగమని.. కాలంతో పాటు క్రమంగా ఈ బ్యూటీ టిప్ మన దగ్గరికీ వచ్చిందని.. ఈ విధానాన్ని చాలా మంది ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారని.. ముఖ్యంగా ఫేస్ ఉబ్బినా, కళ కోల్పోయినట్లుగా కనిపించినా ఈ టిప్ బాగా పనిచేస్తుందని అంటున్నారు.
"ముఖానికి ఐస్‌తో మర్దన చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల చర్మరంధ్రాలు తెరుచుకుని స్కిన్ బిగుతుగా అనిపిస్తుంది. అలాగే కొద్దిగా నిగనిగలాడుతున్నట్లూ కనిపిస్తుంది. మేకప్ వేసినా ఫేస్‌కి చక్కగా పట్టేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఐస్‌ని ముఖానికి రుద్దుతుంటారు."- డాక్టర్ శైలజ సూరపనేని (సౌందర్య నిపుణురాలు)
నేరుగా అప్లై చేయకండి :ముఖాన్ని ఐస్‌తో రుద్దుకోవడం మంచిదని కొంతమంది అదే పనిగా చేస్తుంటారు. అలాగే నేరుగా ఐస్‌ని అప్లై చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుందని శైలజ సూరపనేని చెబుతున్నారు. ఫేస్‌కి ఐస్‌ని నేరుగా అప్లై చేయకుండా.. ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి, మృదువుగా వృత్తాకారంలో మసాజ్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఐస్ పెట్టాక ఫేస్ పొడిబారుతుంది. కాబట్టి, మాయిశ్చరైజర్ తప్పకుండా అప్లై చేయాలి.