తెలంగాణ

telangana

ETV Bharat / health

30 ఏళ్లలోనే పీరియడ్స్​ ఆగిపోయే గండం - రోగాల ముప్పేట దాడికి ఛాన్స్ - ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్​! - PREMATURE MENOPAUSE SYMPTOMS

- పెరుగుతున్న ప్రిమెచ్యూర్​ మెనోపాజ్ కేసులు - పలు సూచనలు చేస్తున్న ఆరోగ్య నిపుణులు

Premature Menopause Symptoms
Premature Menopause Symptoms (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 3:11 PM IST

Premature Menopause Symptoms:పీరియడ్స్​ ఆగటమనేది మహిళల్లో సాధారణమైన ప్రక్రియ. సాధారణంగా 45-55 ఏళ్ల మధ్యలో ఇది జరుగుతుంది. కానీ కొందరికి చాలా త్వరగా అంటే 30 నుంచి 40 ఏళ్ల ముందే నిలిచిపోవచ్చు. దీన్నే ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటారు. ఇది శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని అన్నిసార్లూ నివారించలేకపోవచ్చు. కానీ, కారణాలను అర్థం చేసుకోవటం, లక్షణాలను గుర్తించటం, తగు చికిత్స తీసుకోవటం ద్వారా ఉపశమనం పొందొచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ముందుగానే నెలసరి ఆగిపోవటం మీద అవగాహన కలిగి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసలేంటి ప్రిమెచ్యూర్​ మెనోపాజ్​: రుతుక్రమం అనేది గర్భధారణకు తోడ్పడే ప్రక్రియ. ప్రతినెలా అండాశయాల నుంచి ఒక అండం విడుదల కావటం, ఇది కుదురు కోవటానికి గర్భసంచీలో ఒక పొర ఏర్పడటం, గర్భం ధరించకపోతే ఈ పొర విడిపోయి రుతుస్రావం రూపంలో బయటకు రావటం, ఇదంతా ఒక చక్రంలా సాగుతుంది. ఈ ప్రక్రియ ఎంత సహజమో నెలసరి నిలిచిపోవటమూ (మెనోపాజ్‌) అంతే. కానీ కొందరికి ముందుగానే నెలసరి నిలిచిపోతుంటుంది. దీన్ని ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఇన్‌సఫిషియెన్సీ అంటారని ప్రముఖ గైనకాలజిస్ట్​ డాక్టర్​ మంజుల అనగాని చెబుతున్నాపు. ఈ సమస్య ఉన్న వారిలో 40 ఏళ్ల లోపే అండాశయాల పనితీరు అస్తవ్యస్తమవుతుందని, ఫలితంగా అండాలు విడుదలకావంటున్నారు. ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తీ తగ్గుతుందని, చివరికి రుతుక్రమం నిలిచిపోవటానికి దారితీస్తుందని చెబుతున్నారు.

కారణాలు ఏంటి:నెలసరి ముందుగా నిలిచిపోవటానికి జన్యువుల దగ్గరి నుంచి ఇతరత్రా చికిత్సల వరకూ రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. అందులో కొన్ని చూస్తే,

  • కొందరికి వంశపారంపర్యంగా త్వరగా నెలసరి ఆగిపోవచ్చని చెబుతున్నారు. అంటే తల్లి, సోదరిల్లో ఎవరైనా త్వరగా నెలసరి నిలిచిపోయిన వారుంటే వీరికీ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు.
  • కొందరిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున అండాశయాల మీద దాడి చేయొచ్చని, ఇది త్వరగా నెలసరి నిలిచిపోవటానికి దారితీస్తుందని అంటున్నారు. అలాగే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్, థైరాయిడ్‌ జబ్బులు, ల్యూపస్‌ వంటి స్వీయరోగనిరోధక జబ్బులూ అండాశయాలు సరిగా పనిచేయకపోవటానికి కారణం కావొచ్చని సూచిస్తున్నారు.
  • పుట్టుకతో ఒకే ఒక్క X క్రోమోజోమ్‌ ఉండటం (టర్నర్న్‌ సిండ్రోమ్‌), ఫ్రాజైల్‌ ఎక్స్‌ సిండ్రోమ్‌ వంటి క్రోమోజోమ్‌ లోపాలూ అండాశయాల పనితీరును అస్తవ్యస్తం చేయొచ్చని, దీంతో ముందుగానే నెలసరి ఆగిపోయే ప్రమాదముందని అంటున్నారు.
  • క్యాన్సర్‌ బారినపడ్డప్పుడు తీసుకునే కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి చికిత్సలు అండాశయాలను దెబ్బ తీయొచ్చని, ఇది నెలసరి ఆగిపోవడానికి కారణం కావొచ్చని అంటున్నారు.
  • ఫలోపియన్‌ గొట్టాలకు, అండాశయానికి చీము పట్టటం, ఎండోమెట్రియోసిస్, అండాశయాల్లో క్యాన్సర్‌ రహిత కణితులు, అండాశయ క్యాన్సర్‌ వంటి సమస్యలు గలవారిలో సిజేరియన్​తో అండాశయాలను తొలగిస్తుంటారు. ఇలాంటివారికి వయసుతో నిమిత్తం లేకుండా రుతుక్రమం ఆగిపోతుందని పేర్కొంటున్నారు.
  • క్షయ, గవదబిళ్లల వంటి ఇన్‌ఫెక్షన్లు సైతం అండాశయాల పనితీరును అస్తవ్యస్తం చేయొచ్చని, ఇది కొందరిలో ముందుగానే నెలసరి నిలిచిపోవటానికి దారితీయొచ్చని చెబుతున్నారు.
  • కొందరికి అండాశయాల్లో నీటి బుడగలు (పీసీఓఎస్‌) తలెత్తటం వల్ల హార్మోన్ల ఉత్పత్తి అస్తవ్యస్తమై అండాలు దెబ్బతినొచ్చని, ఇదీ త్వరగా నెలసరి ఆగిపోడానికి కారణమే అంటున్నారు.

లక్షణాలివే: ముందుగా నెలసరి నిలిచేవారిలోనూ, సాధారణంగా రుతుక్రమం ఆగిన వారిలో మాదిరిగానే లక్షణాలు కనిపిస్తుంటాయని, కాకపోతే ఇవి చిన్న వయసులో తలెత్తుతుంటాయని సూచిస్తున్నారు.

  • మొదట్లో నెలసరి సమయానికి రాకపోవటం, రుతుక్రమం తక్కువగానో, ఎక్కువగానో అవటం వంటి మార్పులు కనిపించి, చివరికి పూర్తిగా ఆగిపోతుంటాయని చెబుతున్నారు.
  • బాగా చికాకు పెట్టే సమస్యల్లో వేడి ఆవిర్లు ఒకటి. హార్మోన్ల మోతాదుల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఉన్నట్టుండి శరీరంలో సెగ పుట్టినట్టు అనిపిస్తుంటుందని, దీంతో పాటు చెమటలు పట్టటం, గుండె వేగం పెరగటం వంటివీ ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
  • వేడి ఆవిర్లతో పాటు కొందరికి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు అతిగా చెమట్లు పట్టటం, తెల్లారిన తర్వాత నిస్సత్తువ, నీరసమూ ఆవహిస్తాయని అంటున్నారు.
  • హార్మోన్ల మార్పులు మూడ్‌ మీదా ప్రభావం చూపుతాయని, ఫలితంగా చిరాకు, కుంగుబాటు, ఆందోళన, దిగులు, నిరాశ తలెత్తొచ్చని చెబుతున్నారు.
  • ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గటం వల్ల యోని కణజాలాలు పొడిబారడం, పలుచగా అవ్వడం జరగొచ్చని చెబుతున్నారు. ఇది సంభోగ సమయంలో నొప్పి, మంట వంటి వాటికి దారితీయొచ్చని, జననాంగ ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు.
  • హార్మోన్ల మార్పులతో నిద్రకు భంగం కలగొచ్చని, నిద్ర త్వరగా పట్టకపోవటం, ఎక్కువసేపు మెలకువగా ఉండటం వంటివి తలెత్తొచ్చని చెబుతున్నారు.
  • కొందరికి మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటమూ ఇబ్బంది పెడతాయని అంటున్నారు
  • తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు తలెత్తటం, మూత్రాన్ని ఆపలేకపోవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకవటం వంటివీ ఈ సమస్యకు లక్షణాలుగా చెబుతున్నారు.
  • ఎముక పటుత్వంలో కీలకపాత్ర పోషించే ఈస్ట్రోజన్‌ మోతాదులు తగ్గటం ఎముకలనూ గుల్లబరుస్తుంది. దీంతో ఎముకలు ఎండు పుల్లల్లా మారతాయి. చిన్నపాటి గాయాలకే విరిగే ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు.

నిర్ధరణ ఎలా?: ఆయా లక్షణాలను బట్టి ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ను అంచనా వేస్తారని డాక్టర్​ మంజుల అనగాని అంటున్నారు. అవసరాన్ని బట్టి రక్త పరీక్షలతో నిర్ధరిస్తారని చెబుతున్నారు.

చికిత్స ఏంటి?ముందుగానే నెలసరి నిలిచిపోవటాన్ని వెనక్కి మళ్లించలేం. కానీ లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవటానికి, దీర్ఘకాలంలో తలెత్తబోయే జబ్బుల ముప్పును తగ్గించటానికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే రోజువారీ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవటమూ ఎంతో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. నెలసరి ముందుగా నిలిచినవారికి ఎముక క్షీణించే ముప్పు ఎక్కువ. కాబట్టి ఎముకల బలోపేతానికి తోడ్పడే కాల్షియం, విటమిన్‌ డితో కూడిన ఆహారం తినటం చాలా ముఖ్యమని, వాకింగ్​, రన్నింగ్, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని డాక్టర్​ మంజుల అనగాని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మెనోపాజ్​లో వేడి ఆవిర్లు, నిద్రలేమితో ఇబ్బందులా? - ఈ డైట్​ చాలా మేలు చేస్తుందట!

ఈ మహిళలకు నిద్రలేమి, దంత సమస్యలు కూడా! - ఇలా చేయాలట!

ABOUT THE AUTHOR

...view details