Pregnancy Exercise Benefits:శీతాకాలంలో సాధారణంగానే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని.. ముఖ్యంగా గర్భిణుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం వంటి సమస్యలు ఈ కాలంలో మరికొంతమందిని ఇబ్బంది పెడుతుంటాయని అంటున్నారు. అయితే, ఈ విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. చలికాలంలోనూ ప్రెగ్నెన్సీని ఆరోగ్యంగా ఆస్వాదించచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అందుకే నీళ్లు తాగాలట!
మనకు వాతావరణం కాస్త చల్లగా మారితే అస్సలు దాహం అనిపించదు. అలాగని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శరీరంలో నీటి స్థాయులు తగినంత లేకపోతే ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది బిడ్డ ఎదుగుదలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా.. ఇదిలాగే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏ కాలమైనా తగినంత మోతాదులో నీళ్లు తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లూ తాగుతుండాలని.. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుందని వెల్లడిస్తున్నారు. అలాగే ఈ సీజన్‌లో లభించే జామ, కమలాఫలం.. వంటి పండ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
అరోమా థెరపీ.. మంచిదేనట!
చలికాలంలో చాలామందిని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుంటుంది. చల్లటి గాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరిగి.. ఫలితంగా కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయని అంటున్నారు. ఇంకా గుండెకూ రక్త ప్రసరణ సాఫీగా సాగదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణుల్లో ఇలాంటి సమస్యలుంటే అది కడుపులో ఎదిగే బిడ్డకూ ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలున్న వారు డాక్టర్ సలహా మేరకు సంబంధిత నిపుణుల చేత అరోమా థెరపీ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో లావెండర్, టీట్రీ, యూకలిప్టస్ వంటి అత్యవసర నూనెలతో శరీరమంతా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని సూచిస్తున్నారు. తద్వారా శారీరక నొప్పులు తగ్గడమే కాకుండా.. చురుకుదనమూ వస్తుందని వివరిస్తున్నారు. అలాగే పొడి చర్మం సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చని చెబుతున్నారు.
చర్మ సంరక్షణ తప్పనిసరి!
చలికాలం అనగానే చర్మం పొడిబారడం వల్ల దురద, మంట వంటి సమస్యలు గుర్తుకు వస్తుంటాయి. ఇక గర్భిణుల్లోనైతే పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతూ పగిలి.. ఆ ప్రదేశంలో దురద ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ముందు ముందు స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడతాయని వెల్లడిస్తున్నారు. అందుకే వైద్యుల సలహా మేరకు ప్రత్యేక క్రీములు, లోషన్లు, నూనెలు వాడచ్చని చెబుతున్నారు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పొట్ట భాగంలో నెమ్మదిగా మసాజ్ చేసుకోవడం వల్ల.. అటు రక్తప్రసరణ మెరుగవడమే కాకుండా.. ఇటు చర్మం పొడిబారకుండానూ జాగ్రత్తపడచ్చని తెలిపారు. అలాగే ప్రసవానంతరం స్ట్రెచ్‌మార్క్స్ రాకుండా కూడా ఈ చిట్కా తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు చర్మానికి వాడే సౌందర్య ఉత్పత్తుల్నీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డపై వాటి ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.