Food Guide for Pcos Women : నేటి ఆధునిక కాలంలో ఎంతో మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కాగా, అలాంటి సంతానలేమి సమస్యల్లోపీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది మహిళలు ఈ సమస్య వస్తే పిల్లలు పుట్టరని భయపడతారు. కానీ, చక్కటి జీవనశైలిని పాటిస్తూ.. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు.. పీసీఓఎస్ అంటే ఏమిటి? ఈ సమస్యతో బాధపడేవారు ఎలాంటి జీవనశైలి అలవాట్లు, ఆహార నియమాలు పాటించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది క్రమంగా పీసీఓఎస్‌కి దారితీస్తుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు, డాక్టర్ లతాశశి. దీని వల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్ స్వింగ్స్.. వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ నియంత్రణలో ఉండడంతో పాటు పీసీఓఎస్ అదుపులోకి రావాలంటే ముందుగా మీ డైలీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా పీసీఓఎస్ ఉన్నవారు.. రోజూ తీసుకునే ఆహార పరిమాణంతో పాటూ ఆహార వేళలను తప్పనిసరిగా పాటించాలంటున్నారు. అదే విధంగా.. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్ర కూడా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. అలాగే ఒత్తిడి లేకుండానూ చూసుకోవాలని చెబుతున్నారు. ఇకపోతే శారీరక వ్యాయామాలు.. కండరాల బలానికి, గుండెకు సంబంధించిన వాటిని ఎంచుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎత్తుకు మించి బరువు ఉంటే మాత్రం తగ్గాలంటున్నారు. అయితే, కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారని చెబుతున్నారు డాక్టర్ లతాశశి.