Paracetamol Side Effects on Health:జ్వరం వచ్చిందా పారాసిటమాల్ వేసేయ్..! కాస్త తలనొప్పిగా ఉందా పారాసిటమాల్ వేసేయ్..! పెద్ద వాళ్లైతే కీళ్ల నొప్పులకు పారాసిటమాలు మాత్రనే ఎక్కువగా వాడుతుంటారు. ఇవే కాకుండా మనలో చాలా మంది ఒంట్లో కాస్త నలతగా ఉన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసేస్తుంటారు. సర్వరోగ నివారిణిలా ప్రతిదానికి దీనినే ఉపయోగిస్తుంటారు. కొందరైతే ఇందుకు డాక్టర్ల ప్రిస్కెప్షన్ కూడా తీసుకోరు. నేరుగా మెడికల్ షాప్‌నకు వెళ్లి పారాసిటమల్ మందులు తెచ్చుకుని వేసుకుంటారు. అచ్చం ఇలానే మీరు కూడా ఇలానే చీటికీ మాటికీ పారాసిటమాల్ వేసుకుంటున్నారా?
అయితే ఇకపై అలా చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలట. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యల ముప్పు పెరగటానికి కారణమవుతున్నట్టు బ్రిటన్‌కు చెందిన నాటింగ్‌హామ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. "Long-term use of paracetamol and risk of kidney disease: a systematic review and meta-analysis" పేరిట బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మనలో చాలా మంది జ్వరానికి ప్రధానంగా పారాసిటమాల్‌నే వినియోగిస్తుంటారు. వృద్ధులు అయితే, కీళ్ల నొప్పులు తగ్గటానికీ వేసుకుంటుంటారు. ఇది సురక్షితమని, పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవని అనుకుంటారు. కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావమయ్యే ముప్పు 24 శాతమ, పేగుల్లో రక్తస్రావమయ్యే ముప్పు 36 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనంలో బయటపడింది. అలాగే కిడ్నీజబ్బులు 19 శాతం, గుండె వైఫల్యం 9 శాతం, అధిక రక్తపోటు 7 శాతం వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నట్టు చెబుతోంది.