తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్​ : స్మోకింగ్ చేయకపోయినా - మీకు నోటి క్యాన్సర్ రావొచ్చు - ఎందుకో తెలుసా? - Oral Cancer in Non Tobacco User - ORAL CANCER IN NON TOBACCO USER

Oral Cancer Causes : అందరినీ భయపెట్టే ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్. ఇందులో చాలా రకాలుంటాయి. వాటిలో ఒకటైన నోటి క్యాన్సర్.. పొగ తాగేవారికి, పొగాకు నమిలేవారికి ఎక్కువగా వస్తుంది. కానీ.. వీటిని ముట్టుకోని వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందట!

Oral Cancer Causes in Non Tobacco Users
Oral Cancer Causes in Non Tobacco Users

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 10:43 AM IST

Oral Cancer Causes in Non Tobacco Users : క్యాన్సర్.. ఎంత ప్రమాదకరమైన వ్యాధో మనందరికీ తెలిసిన విషయమే. చేజేతులా కొనితెచ్చుకునే క్యాన్సర్లు కొన్నికాగా.. ఏ కారణం లేకుండా వచ్చే క్యాన్సర్లు మరికొన్ని. అందులో నోటి క్యాన్సర్లు ఒకటిగా చెప్పుకోవచ్చు. నిజానికి చుట్ట, బీడీ, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులు అధికంగా యూజ్ చేసే వారిలో నోటి క్యాన్సర్ ముప్పు ఎక్కువ. కానీ, స్మోక్ చేయని వారిలో కూడా నోటి క్యాన్సర్ వస్తుందంటున్నారు నిపుణులు. ధూమపానం(Smoking) చేయనివారిలో క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలున్నాయని చెబుతున్నారు అంకాలజీ డాక్టర్ మన్‌దీప్ సింగ్ మల్హోత్రా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మద్యపానం :అధిక మద్యపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు డాక్టర్ మన్​దీప్ సింగ్. 2017లో 'జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. అధిక మద్యపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వెల్లడైంది.

హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) :ఇది లైంగిక సంక్రమణ వ్యాధి. నోటి క్యాన్సర్​తో సహా అనేక రకాల క్యాన్సర్లకు హెచ్​పీవీ కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా HPV 16, 18 రకాలు నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని చెబుతున్నారు.

నోటి అపరిశుభ్రత :నోరు పరిశుభ్రంగా లేకపోతే దంత ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా రకరకాలు ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు దారితీస్తుంది. అయితే ఇవి మాత్రమే కాదు.. నోటి అపరిశుభ్రత ఓరల్ క్యాన్సర్ రావడానికి కారణం కావొచ్చంటున్నారు వైద్యులు. పొగ తాగని వారిలో నోటి క్యాన్సర్ రావడానికి ఇది కూడా ప్రధాన కారణంగా మారొచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు నోరును శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఓరల్ లైకెన్ ప్లానస్ : ఇది కూడా స్మోక్ చేయని వారిలో నోటి క్యాన్సర్​కు కారణం కావొచ్చంటున్నారు వైద్యులు. మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అది నోటిలోని శ్లేష్మ పొరను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా నాలుకపై తెల్లని మచ్చలు, నాలుక దెబ్బతినడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్నే నోటి లైకెన్ ప్లానస్ అంటారు.

ఇంకా.. తమలపాకు లేదా అరెకా గింజలను నమలడం వంటి కొన్ని పొగాకు లేని అలవాట్లు కూడా.. నోటి కుహరంలో ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్, ల్యూకోప్లాకియా, ఎరిత్రోప్లాకియా వంటి రోగాలకు దారితీస్తాయంటున్నారు డాక్టర్ మన్‌దీప్ సింగ్ మల్హోత్రా​. ఇవి క్రమంగా నోటి క్యాన్సర్‌గా మారవచ్చని సూచిస్తున్నారు. అలాగే Li-Fraumeni సిండ్రోమ్ వంటి జన్యుపరమైన కారకాలు.. స్మోక్ చేయని వారిలో నోటి క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details