తెలంగాణ

telangana

ETV Bharat / health

పిల్లల్లో కొవ్వు గడ్డలు, కణితులు కనిపిస్తున్నాయా?- ఎలాంటి చికిత్స అవసరం- డాక్టర్ ఏం అంటున్నారు? - Lumps and Bumps in Kids

Lumps and Bumps in Kids : పిల్లల శరీరంపై పుట్టుకతో వచ్చే కొవ్వు గడ్డలు, కణితుల వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. అయితే, కణితుల్లో చాలా రకాలు ఉంటాయంటున్నారు ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ ఎ. నరేంద్రకుమార్. కొన్ని గడ్డలు, కణితుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్న చిన్న చికిత్సల ద్వారా కూడా కణితులను తొలగించవచ్చని సూచిస్తున్నారు.

Lumps and Bumps in Kids
Lumps and Bumps in Kids (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Sep 19, 2024, 1:21 PM IST

Updated : Sep 19, 2024, 2:48 PM IST

Lumps and Bumps in Kids : పిల్లల్ని వారి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దదిగా భావిస్తుంటారు. పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో శరీరంపై పెరిగే గడ్డ, కంతి లాంటివి ఒక్కటి. అవి ఎలాంటి హానీ చేయకపోయినా తల్లిదండ్రుల మనసులో పలు సందేహాలు, లెక్కలేనన్ని భయాలు ఉత్పన్నమవుతాయి. అయితే, అలాంటి వాటిలో కొన్నింటి చికిత్స అవసరమే ఉండకపోవచ్చు, మరి కొన్నింటికి చిన్నపాటి శస్త్రచికిత్స అవసరం రావచ్చు. అలాంటి గడ్డలు, కణితులకు గల కారణాలు చికిత్స విధానం గురించి ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ ఎ. నరేంద్రకుమార్ ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వు గడ్డలు
కొందరికి చర్మం కింద మెత్తటి గడ్డలు ఏర్పడుతాయని. కొవ్వు కణాల నుంచి పుట్టుకొచ్చే వీటిని, లైపోమాలని అంటారని ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ ఎ. నరేంద్రకుమార్ తెలిపారు. ఇవి క్రమంగా సైజు పెరుగుతూ ఉంటాయని, కొందరిలో చాలా పెద్దగానూ అవ్వచ్చు, అయితే, ఇవి ఎలాంటి హాని కలిగించవని అంటున్నారు. ముట్టుకుంటే మృదువుగా అనిపిస్తాయని, నొక్కితే అటూఇటూ కదులుతాయని వెల్లడించారు. కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలోనూ ఉండొచ్చని, కొవ్వు గడ్డలు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదంటున్నారు. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటాయని. ఇవి మగపిల్లల్లో, అదీ ఊబకాయులు, బొద్దుగా ఉండే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయని డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు.

అల్ట్రాసౌండ్‌ పరీక్షతో లైపోమాను నిర్ధరిస్తారు. విడిగా ఉన్న, సైజు పెరుగుతున్న గడ్డలను తొలగించాల్సి ఉంటుంది. చిన్న కోతతో చేసే చికిత్సతో గాటు అంతగా కనిపించదు.

లింఫ్‌ గ్రంథుల వాపు
మన శరీరం అంతటా 500 నుంచి 600 లింఫు గ్రంథులుంటాయి. మెడ భాగంలో చంకలు, గజ్జల వంటి భాగాల్లో మరింత ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తికి చెందిన లింఫు వ్యవస్థలో ఒక భాగమే. రక్షక భటులుగా పనిచేసే లింఫ్‌ గ్రంథులు ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వస్తే ఉబ్బుతాయి. ఇన్‌ఫెక్షన్‌కు ఎదురుగా నిలిచి పోరాడతాయి. మాములుగా లింఫు గ్రంథులు చేతికి తగలవు. కానీ ఉబ్బినప్పుడు పెద్దగా అవుతాయి.

పిల్లల్లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన అనంతరం లింఫు గ్రంథులు తిరిగి మామూలు స్థితికి వస్తాయి. వీటికి ప్రత్యేకించి చికిత్స అవసరం ఉండదు. అయితే, ఒకవేళ వీటి సైజు 2.5 సెం.మీ. కన్నా పెద్దగా మారినా, ఒకటి కన్నా ఎక్కువ రకం గ్రంథులు ఉబ్బినా, కొత్తగా మరిన్ని గ్రంథులు ఉబ్బుతున్నట్టు అనిపించినా, గట్టిగా రాయిలా మారినా, కాలేయం ఉబ్బినా, బరువు తగ్గటంతో పాటుగా జ్వరం, వంటి లక్షణాలున్నా పరీక్షలు చేసుకోవడం అవసరం. అవసరమైతే చిన్నముక్కను బయటకు తీసి పరీక్షించాల్సి ఉంటుంది.

తైలగ్రంథి తిత్తులు
కొందరికి చర్మంలోని నూనె గ్రంథులకు దెబ్బతగలటం లేదా వాటి మార్గంలో అడ్డంకులు రావడం వల్ల తిత్తులు ( సెబాషియస్‌ సిస్ట్స్‌) ఏర్పడుతుంటాయి. ఇవి మెత్తగా ఉంటాయి. నొక్కితే వాటి ఆకారం మారుతుంటాయి. వీటిపై కెరటిన్‌ అనే పదార్థంతో కూడిన తెల్లటి పొలుసులూ కనిపిస్తుంటాయి. ఇవి నెమ్మదిగా పెరుగుతుంటాయి. పెద్దగా ఇబ్బంది కలిగించవు. అరుదుగా నొప్పి వంటి లక్షణాలు తలెత్తొచ్చు. మెడ, ముఖం, వృషణాలు, మాడు, వీపు వంటి భాగాల్లో ఎక్కువగా ఇలాంటి తిత్తులు కనిపిస్తుంటాయి.

అయితే, తైలగ్రంథి తిత్తులు చిన్నగా ఉంటే ఎలాంటి చికిత్సా అవసరం లేదని డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఒకవేళ సైజు పెరుగుతున్నా, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా, నొప్పి పుడుతున్నా, చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తున్నా తొలగించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

కంటి కొస వద్ద తిత్తి
కంటి కొస వద్ద తిత్తి అనేది పుట్టుకతో వచ్చే సమస్య. పిండస్థ దశలో చర్మం ఏర్పడే సమయంలో దీనికి బీజం పడుతుంది. కొన్ని పైచర్మకణాలు చర్మం కిందుండే కొవ్వులోకి చేరటంతో డెర్మాయిడ్స్‌ అనే తిత్తులు ఏర్పడుతాయి. ఇవి వయసుతో పాటుగా పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా శరీరం మధ్య భాగాల్లో తలెత్తుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కంటి కొస వద్ద ఏర్పడొచ్చు ( ఎక్స్‌టర్నల్‌ యాంగ్యులర్‌ డెర్మాయిడ్‌ ). ఈ తిత్తులు కదులుతూ ఉంటాయి. నొప్పి కలిగించవు గానీ చికిత్స తీసుకోకపోతే సైజు పెరుగుతుంటాయి. చివరికి చూపునకు అడ్డంకిగా మారొచ్చు. సైజు పెరుగుతుంటే తిత్తులను శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుందని తెలిపారు.

ఎముక మీద కణితి
ఎముక కణాలు నియంత్రణ లేకుండా, విభజన చెందటం మూలంగా కణితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇవి చాలావరకూ మామూలువే. ప్రాణాపాయం కలిగించవు. అలాగే ఇతర భాగాలకు విస్తరించవు. నెమ్మదిగా పెరిగే ఇవి పుర్రె, పొడవైన ఎముకల మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న పిల్లల్లో, యుక్తవయసు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కళ్లు, ముక్కు వంటి భాగాల్లో ఏర్పడే గడ్డలతో వల్ల తలనొప్పి, ముక్కుగదుల ఇన్‌ఫెక్షన్, వినికిడి, చూపు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

అయితే, వీటికి చాలావరకూ చికిత్స అవసరం లేదు. చిన్న గడ్డలు కొద్ది సంవత్సరాల తర్వాత వాటంతటవే పోతాయి. ఒకవేళ అవసరమైతే శస్త్రచికిత్స చేసి తొలగిస్తారని డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు.

రక్తం గడ్డలు
ఇవి రక్తనాళాల కణాల నుంచి పుట్టుకొస్తాయి. ఎర్రగా, రక్తం గడ్డల మాదిరిగా కనిపించే వీటిని హెమాంజియోమాస్‌ అని పిలుస్తారు. ముఖం, ఛాతీ, వీపు మీద ఎక్కువగా వస్తుంటాయి. ముట్టుకుంటే చేతికి వేడిగా అనిపిస్తాయి. కొన్నిసార్లు వీటి నుంచి రక్తం వస్తుంది, పుండు పడొచ్చు, ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. పైపైన ఏర్పడే గడ్డలు చాలావరకూ వాటంతటవే పోతాయి. అయితే, పదేళ్ల వయసుకు వచ్చేసరికి కొందరిలో ఆనవాళ్లు కూడా కనిపించవు.

గడ్డలు పెద్దగా ఉంటే శస్త్రచికిత్సతో తొలగించాలి. శస్త్రచికిత్స చేయటం కుదరని చోట్ల ఉండే గడ్డలకు ప్రొప్రనోలాల్‌ మందు బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ నరేంద్రకుమార్ వెల్లడించారు.

రొమ్ము గడ్డలు
పిల్లల్లో రొమ్ముల్లో కనిపించే గడ్డలు చాలావరకూ సాధారణమైనవే. ఫైబ్రోఎడినోమా రకం గడ్డలు ఎక్కువ. ఇవి మెత్తగా, గట్టిగా రబ్బరులా, గుండ్రంగా ఉంటాయి. అటూఇటూ కదులుతుంటాయి. రొమ్ములో బటానీ గింజల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇవి వేర్వేరు సైజుల్లో ఉండొచ్చు. గడ్డ ఉన్న చోట నొప్పిగా అనిపిస్తుంది. సైజు పెరిగితే రొమ్ము ఆకారం పెద్దగా అనిపించొచ్చు. వీరిలో గడ్డల సైజు, తీరుతెన్నులను గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది.

చిన్న గడ్డలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే చాలు. పెద్ద గడ్డలైతే కోత పెట్టి తొలగించాల్సి ఉంటుందని డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు.

నాడుల మీద
కొందరికి నాడీకణాల పొర మీద గడ్డలు ( న్యూరోఫైబ్రోమా ) ఏర్పడుతూ ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడైనా ఏర్పడుతాయి. చర్మం రంగులో బుడిపెల మాదిరిగా కనిపిస్తాయి. చాలావరకూ విడిగా, గట్టిగా, నొప్పిలేకుండానే ఉంటాయి. ఎక్కువగా ఇబ్బందేమీ కలిగించవు. కానీ తీవ్రమైన గడ్డలు నాడులు, అవయవాల మీద ఒత్తిడి కలగజేసే ప్రమాదం ఉంది. ప్లెక్జిఫామ్‌ న్యూరోఫైబ్రోమా అనే తీవ్రమైన రకానికి చెందిన గడ్డలు మాత్రం క్యాన్సర్‌గా మారే ప్రమాదమూ ఉందని, శస్త్రచికిత్సతో పూర్తిగా తొలగించటం ఒక్కటే మార్గమని డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రీసెర్చ్ : మీ పిల్లలు చదవట్లేదా? చదివినా గుర్తుండట్లేదా?? - ఇవి తప్పక తినిపించండి - సూపర్ మెమరీ పవర్!

మీ పిల్లలు రోజూ బ్రష్ చేస్తున్నారు కరక్టే - ఇలా చేస్తున్నారా? - లేదంటే పుచ్చిపోవడం ఖాయం!

Last Updated : Sep 19, 2024, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details