New Type Of Blood Test : పిల్లల్లో భవిష్యత్‌లో మధుమేహం వచ్చే అవకాశం ఉందా అనే అంశాన్ని గుర్తించే ఒక కొత్త రక్తపరీక్షను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇకపై ఈ పరీక్ష ద్వారా హృద్రోగం, కాలేయ వ్యాధి వంటి ఊబకాయ సంబంధ రుగ్మతలకు ముందస్తు హెచ్చరికలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్నారుల రక్తంలోని ప్లాస్మాను పరీక్షించడానికి ఇప్పటికే పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో పిల్లల్లో మధుమేహానికి సంబంధించిన ఆరంభ సంకేతాలను గుర్తించొచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే, దశాబ్దాలుగా లిపిడ్లను శరీరంలో ఫ్యాటీ ఆమ్లాలుగా శాస్త్రవేత్తలు భావిస్తూ వస్తున్నారు. వీటిని మంచి, చెడు కొలెస్ట్రాల్‌గా వర్గీకరించేవారు. లిపిడ్లపై లోతుగా పరిశీలించిన శాస్త్రవేత్తలు వీటి తీరుతెన్నులు మరింత సంక్లిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. మాస్ స్పెక్ట్రోమెట్రీ విధానంతో విశ్లేషించినప్పుడు శరీరంలో వేల రకాల లిపిడ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒక్కోదానికి ఒక్కో పాత్ర ఉన్నట్లు తేల్చారు. వాటిని విస్తృతంగా విశ్లేషించి, ఊబకాయ సంబంధ వ్యాధుల ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించొచ్చని తెలిపారు.
''ఈ పరిశోధన భవిష్యత్తులో ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా వచ్చే వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగ పడుతుంది. శరీరంలోని లిపిడ్ అణువులు ఎలా మారుతాయో అధ్యాయనం చేయడం ద్వారా మధుమేహం, ఊబకాయా వ్యాధులను గుర్తించి పూర్తిగా నిరోధించవచ్చు.'' అని డాక్టర్ క్రిస్టినా లెగిడో-క్విగ్లీ తెలిపారు.