Warning Signs of Kidney Disease on Feet:మన ఇంట్లో చీపురు లేకపోతే ఇల్లు శుభ్రం చేయలేం.. అంతా దుమ్ము, ధూళితో నిండిపోతుంది. అదేవిధంగా శరీరంలో మూత్రపిండాలు సరిగా లేకపోతే రక్తాన్ని వడపోయడం కష్టం.. శరీరమంతా వ్యాధుల కుప్పగా మారిపోతుంది. కాబట్టి, మన శరీరంలో అత్యంత ముఖ్యమైన కిడ్నీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది రకరకాల కిడ్నీ(Kidney) వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు.
అయితే, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకుంటే.. అవి గుండె జబ్బులు, డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వంటి పరిస్థితులకు దారి తీయవచ్చంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. మూత్రపిండాల వ్యాధి ప్రారంభ సంకేతాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా అవసరమైన చికిత్స పొంది మూత్రపిండాల వైఫల్యానికి దారితీయకుండా కాపాడుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా.. మీ పాదాలపై ఈ 6 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎడెమా (వాపు): మూత్రపిండాల వ్యాధిని సూచించే ముఖ్యమైన సంకేతాలలో వాపు ఒకటని చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. బాడీలో కిడ్నీ డిసీజ్ ఎటాక్ అవుతే.. సాధారణంగా పాదాలు, చీలమండలలో వాపు కనిపిస్తుందని చెబుతున్నారు. బలహీనమైన మూత్రపిండాల పనితీరు కారణంగా శరీరం నుంచి అదనపు ద్రవం, సోడియంను తొలగించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ కారణంగా శరీర కణజాలలో ఆ ద్రవం చేరి.. తరచుగా పాదాలు ఉబ్బడం లేదా బిగుతుగా మారడం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
2023లో 'Nephrology Dialysis Transplantation' అనే జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. సీకేడీ(chronic kidney disease - CKD) ఉన్న వ్యక్తులలో ఎడెమా లేని వారి కంటే.. ఎడెమా ఉన్నవారిలో మరణాలు, ఆసుపత్రిలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ పరిశోధనలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్. Yuxiang Wang పాల్గొన్నారు. సీకేడీ ఉన్న రోగులలో ఎడెమా ఒక ముఖ్యమైన రోగ లక్షణమని ఆయన పేర్కొన్నారు.
చర్మంలో మార్పులు : దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వివిధ చర్మ మార్పులకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటిలో కొన్ని పాదాలపై కనిపించవచ్చంటున్నారు. ముఖ్యంగా రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల చర్మం ముదురు రంగులోకి మారవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, చర్మం ఆకృతిలో మార్పులు రావచ్చంటున్నారు. అంటే.. చర్మం పొడిగా, దురదగా లేదా పొరలుగా మారవచ్చంటున్నారు. ఇది ముఖ్యంగా పాదాలలో కనిపించవచ్చంటున్నారు నిపుణులు.
దురద :మీరు మూత్రపిండాల సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే నిరంతర దురద అనే లక్షణం కూడా ఇబ్బంది పెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ముఖ్యంగా పాదాలతో సహా దిగువ అంత్య భాగాలలో కనిపిస్తుందంటున్నారు. రక్తప్రవాహంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల దురద వస్తుందని చెబుతున్నారు నిపుణులు.