Kidney Disease Symptoms :మన శరీరంలో గుండె తర్వాత.. అత్యంత కీలకంగా పనిచేసే అవయవాలలో కిడ్నీలు ఒకటి. మూత్రపిండాలు మన బాడీలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తాయి. అయితే, నేటి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాలతో అవి పాడైపోతున్నాయి. ఒక్కసారి కిడ్నీలు దెబ్బతింటే.. డయాలిసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, కిడ్నీ వ్యాధులను తొలిదశలో గుర్తిస్తే త్వరగా దెబ్బతినకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చని అంటున్నారు. అయితే, కిడ్నీ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ నెఫ్రాలజీస్ట్ 'డాక్టర్ శ్రీభూషణ్ రాజు' చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల లక్షణాలు తొలిదశలో పెద్దగా కనిపించవు. కానీ, జబ్బు ముదురుతూ వస్తున్నాకొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి వైద్యులను సంప్రదిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆకలి లేకపోవడం : రక్తంలో విషతుల్యాలు పెరుగుతున్నా కొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. అలాగే వికారంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏ ఆహారం తినాలని అనిపించదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
పాదాలలో వాపు, నొప్పి, దురదగా అనిపిస్తోందా? - అయితే మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!
పొడి చర్మం , దురద : కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంలో క్యాల్షియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
పాదాల వాపు : కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోవు. దీనివల్ల మన బాడీలో ముఖ్యంగా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. అలాగే పాదాలు, కళ్లు ఉబ్బడం మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మూత్రం ఎక్కువగా రావడం :కిడ్నీలు దెబ్బతింటే.. మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చు. దీనివల్ల నైట్ టైమ్‌లో అధికంగా మూత్రం రావడం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.