Is Beer Good for Human Body:బీర్ తాగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు ఎముకల సాంద్రత పెరుగుతుందని వివరించారు. ఇంకా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు. అయితే, బీర్‌ను అతిగా తాగడం వల్ల కూడా అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని చెబుతున్నారు. బరువు పెరగడం, మద్యానికి బానిస కావడం, కాలేయం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రోజుకు ఎంత తాగాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. మహిళలు సుమారు 5శాతం ఆల్కహాల్‌తో రోజుకు 330 మిల్లీలీటర్ల బీర్ తాగాలని చెబుతోంది. అదే పురుషులు అయితే, 660 మిల్లీ లీటర్ల వరకు తాగొచ్చని అంటోంది. ఇందులో ఉండే పాలీపినోల్స్, విటమిన్లు, అమైనో యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి కృషి చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలా అని వారానికి 14 యూనిట్లు మించకూడదని సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో తాగడం వల్ల ప్రయోజనాలు కాకుండా చెడు ప్రభావాలు చూపెడుతాయని వివరించారు.
ఎముకల సాంద్రత పెరుగుతుంది:బీర్‌ను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ (NHS) చేపట్టిన Moderate Consumption of Beer and Its Effects on Cardiovascular and Metabolic Health: An Updated Review of Recent Scientific Evidence అధ్యయనం ప్రకారం.. ఎముకల ఆరోగ్యాన్ని పెంచే సిలికాన్ ఇందులో అధికంగా ఉంటుందని బయటపడింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గుండె ఆరోగ్యం మెరుగు:తక్కువ మోతాదులో బీర్‌ను తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు వివరించారు. బీర్ తక్కువగా తాగడం వల్ల రక్త నాళాల ఆరోగ్యం మెరుగుపడి.. గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందన్నారు.
కిడ్నీల్లో రాళ్లు రావట:మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాన్ని బీర్ తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో అధిక నీరు ఉండడం వల్ల మూత్ర విసర్జన సాఫీగా సాగిపోతుందని వివరించారు. ఫలితంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయని పేర్కొన్నారు. దీంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గిపోతుందని వెల్లడించారు.