ICMR Released Dietary Guidelines for Indians : ఆధునిక కాలంలో మనిషి జీవన శైలి సమూలంగా మారిపోయింది. జీవితంలో వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఉరుకులు పరుగులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయింది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే భారత్‌లో ఇవి మాత్రమే కాకుండా అనారోగ్యకర ఆహారం కూడా మనిషి ఆరోగ్యానికి గణనీయంగా ఎసరు పెడుతున్నట్లు తేలింది. దేశంలో 56శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణం అని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ పోషహాకార సంస్థ(ఎన్ఐఎన్) చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
గత కొన్ని దశాబ్దాలుగా భారతీయుల ఆహారపు అలవాట్లు గణనీయంగా మారినట్లు అధ్యయనం తెలిపింది. దీని వల్ల అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్నట్లు తెలిపింది. అధిక ఉప్పు, చక్కెరతో కూడిన ప్రాసెస్‌డ్ ఆహారం తీసుకోవడం, పోషహాకారం అందుబాటులో లేకపోవడం వల్ల పోషకలోపం, అధిక బరువు వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. పోషహాకార లోపంతో 5నుంచి 9ఏళ్ల వయసు ఉన్న చిన్నారుల్లో ఊబకాయ సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది. సమతుల ఆహారం ద్వారా దీన్ని నివారించవచ్చని తెలిపింది. సరైన పోషకాలు లేకుంటే జీవక్రియకు అంతరాయం కలగడం సహా ఇన్సులిన్‌ను తట్టుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.
వివిధ వయసుల వారు పాటించాల్సిన ఆహారపు అలవాట్లుపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు :
- గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూరగాయలు, గింజలను తగిన మోతాదులో తీసుకోవాలి.
- శిశువులు, చిన్నారులు, ఎదుగుతున్న పిల్లకు సమతుల ఆహారం అందించాలి.
- వృద్ధులు అధిక పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి.
- సురక్షిత, శుద్ధ ఆహారాన్ని తీసుకోవాలి.
- నీరు తగినంత తాగాలి.
- కండలు పెంచేందుకు ప్రోటీన్లను తీసుకోవడం మానేయాలి.
- ఉప్పు, నూనె, కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి.
పోషకాహార లోపమే ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం : దేశంలో 56శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణమని ఐసీఎంఆర్ హెచ్చరించడం, వెనువెంటనే పాటించాల్సిన ఆహారపు అలవాట్లపై మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పోషకాహార లోపం ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఏకైక ముప్పు. ముఖ్యంగా 5సంవత్సరాల లోపు పిల్లల్లో 45శాతం మరణాలకు ఇది కారణం అవుతోంది. బాల్యంలో ఎదురయ్యే పోషహాకార లోపం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకే కాకుండా, భవిష్యత్తులో విద్యాపరమైన సవాళ్లకు దారి తీస్తుంది. తట్టు, న్యుమోనియా, అతిసారం వంటి వ్యాధులను పెంచుతుంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తల్లిపాల కొరత వల్ల శిశువులు, పిల్లల్లో పోషహాకార లోపాలు తలెత్తుతున్నాయి.
పోషహాకార లోపంతో భారత్‌లో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక అంచనా ప్రకారం దేశంలో 15శాతం మంది ప్రజలు పోషహాకార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోషహాకార లోపంతో బాధపడుతున్న వారిలో మూడో వంతు మంది భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆహార, వ్యవసాయసాయ సంస్థ తెలిపింది. భారత్‌లో అధికశాతం ప్రజలు దశాబ్దాలుగా పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వాడకానికే పరిమితం అయ్యారు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం తగ్గిపోతోంది. పోషహాకార ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.