Mustard Oil Benefits: ఆవ నూనెను వంటలోకి కాకుండా బియ్యం, పప్పులు నిల్వ ఉంచడానికి, కీటకాలు చేరకుండా ఉండేదుకు వాడుతుంటారు. అయితే, ఇది కేవలం రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఒమెగా 6, ఒమెగా 3, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వివరిస్తున్నారు. Asian Journal of Dairy and Food Research లో ప్రచురితమైన "Medicinal Qualities of Mustard Oil and Its Role in Human Health against Chronic Diseases: A Review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఈ నేపథ్యంలోనే ఆవ నూనెతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మెడ, కండరాల నొప్పులు:ముఖ్యంగా డెస్క్ ఉద్యోగాలు చేస్తున్నవారికి గంటల కొద్దీ కూర్చొనే పని చేస్తుంటారు. ఫలితంగా మెడ, కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు నొప్పి ఉన్నచోట ఆవనూనె రాసి, వృత్తాకారంలో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సమస్యలు: ఇంకా ఆవనూనెలో ఉండే ఎ, ఈ, కె విటమిన్లు చర్మ సమస్యలకూ చెక్ పెడతాయని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చర్మం పొడిబారడం, పొలుసులు రావడం వంటి సమస్యలు ఉన్నవారికి బాగా పనిచేస్తుందని అంటున్నారు. స్నానం చేసిన తర్వాత దీన్ని రాసుకుంటే సహజ నూనెలు కోల్పోకుండా కాపాడుతుందని వివరిస్తున్నారు.
ఒత్తిడి, ఆందోళన: ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా మంచి నిద్ర పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జలుబు, దగ్గు సమస్యలకు చెక్: ఆవనూనెతో జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రెండు చుక్కల ఆవనూనెను వేడినీటిలో వేసి ఆవిరి పట్టాలని సూచిస్తున్నారు. ఇంకా కఫం ఉన్నప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు ఆవనూనెలో వేసి మరిగించి ఆ నూనెను రాత్రి సమయంలో ఛాతి భాగంలో రాసి మర్దనా చేస్తే సరిపోతుందని అంటున్నారు.
గుండెకు మంచిది:ఆవ నూనెలో ఉండే ఒమేగా 3, 6, ఫ్యాటీ యాసిడ్‌లు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల వంటల్లో లేదా సలాడ్‌లో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు దాదాపు 50 శాతం నియంత్రణలో ఉంటాయని వివరిస్తున్నారు. 2004లో Journal of Nutritionలో ప్రచురితమైన "Mustard oil reduces cholesterol and prevents atherosclerosis in rabbits" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.