How to Stop the Habit of Eating Chips in Children:చాలా మంది పిల్లలు ఇంట్లో తయారు చేసిన ఆహారం కన్నా.. బయట షాపుల్లో లభించే వాటిని ఎక్కువగా తింటుంటారు. అందులో చిప్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయి. సమయంతో పని లేకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పొట్టలో వేసుకుంటుంటారు. అన్నం మానేసి మరీ వీటిని తినే పిల్లలూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. పైగా అన్నం బదులు వీటిని తింటున్నారు కదా అని లైట్ తీసుకుంటుంటారు. అయితే ఈ నిర్లక్ష్యమే పిల్లలో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. మరి, పిల్లలు చిప్స్ ఎక్కువగా తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ? ఈ అలవాటుని ఎలా మానిపించాలి ? అనే ప్రశ్నలకు ప్రముఖ పోషకాహార నిపుణులు 'డాక్టర్ జానకీ శ్రీనాథ్' సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
ఎక్కువగా తింటే కష్టమే!సాధారణంగానే పిల్లలు చిప్స్ తింటుంటారు. అయితే, ఎప్పుడో ఒకసారి చిప్స్ తింటే పర్వాలేదు. కానీ, తరచూ తినడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే, మార్కెట్లో దొరికే చిప్స్ అనేక రకాలుగా ఉంటాయి. పొటాటోలు, అరటికాయలతో చేసేవి కొన్ని, పిండితో వండేవి మరికొన్ని. అయితే, వీటిని ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేస్తారు. అలాగే ఇంట్లో చేసిన వాటికన్నా.. బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి తయారుచేస్తారు. చిప్స్ నోటికి రుచిగా కరకరలాడుతూ, ఎక్కువ సేపు నమిలే శ్రమ లేకుండా ఉండడంతో పిల్లలు తినడానికి ఇష్టపడుతుంటారు. చిప్స్ రుచికి అలవాటు పడిపోవడం వల్ల వాళ్ల నాలుక వాటినే ఎక్కువగా కోరుకుంటుందని డాక్టర్ జానకీ శ్రీనాథ్ వివరిస్తున్నారు.
మీ పిల్లలు జంక్ ఫుడ్ బాగా తింటున్నారా?.. ఇవి పాటిస్తే సేఫ్.. లేదంటే..!
చిప్స్‌లో క్యాలరీలు ఎక్కువ :పిల్లలు చిప్స్ తింటే చాలు, వాళ్ల చిన్న పొట్ట నిండిపోతుంది. దీంతో ఇంట్లో ఏ ఆహారం తినకుండా ఉంటారు. అయితే, ఇక్కడ తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే.. చిప్స్‌లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల పిల్లల శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. దీనివల్ల వారిలో పోషకాహార లోపం తలెత్తుతుంది. ఐరన్, జింక్, విటమిన్-ఎ, సి వంటివి శరీరంలో తగ్గిపోతాయి. అంతే కాదు చిప్స్ ఎక్కువగా తినే పిల్లలు తొందరగా అలసిపోతారు, ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంకా ఇదే కొనసాగితే దీర్ఘకాలంలో కంటిచూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్ జానకీ శ్రీనాథ్ హెచ్చరిస్తున్నారు.