How To Protect From Kidney Stone : మన శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకంగా పని చేసే అవయవాల్లో కిడ్నీలు ముందు వరసలో ఉంటాయి. ఈ కిడ్నీలు మన శరీరంలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తాయి. అయితే.. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఇంతలా ఉపయోగపడుతున్న కిడ్నీలు వివిధ కారణాల వల్ల దెబ్బతింటున్నాయి. అయితే.. తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల కిడ్నీలు దెబ్బ తినకుండా చూసుకోవచ్చని నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నీటిని తక్కువగా తాగితే :
మన శరీరానికి తగినంత వాటర్ అందకపోతే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని నిపుణులంటున్నారు. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. అయితే, ఇది వివిధ వ్యక్తులు వారు చేసే శారీరక శ్రమ ఆధారంగా మారుతుందని అంటున్నారు. శరీరంలో వాటర్ శాతం తక్కువైతే మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయని చెబుతున్నారు. దీంతో వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీలకు సవాలుగా మారుతుందట. ఇలా దీర్ఘకాలికంగా కిడ్నీలు ఒత్తిడికి గురైతే కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మాంసం తక్కువ తినండి :
ఎక్కువగా మాంసం తినే వారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. 2015 లో "Kidney International" జర్నల్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఎక్కువ మాంసం తినే వ్యక్తుల మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ ఆక్సలేట్ స్థాయులు కూడా కిడ్నీలో రాళ్లు రావడానికి ఒక కారణమని అంటున్నారు. కాబట్టి, నాన్‌వెజ్ ఎక్కువగా తినే వారు ఈ అలవాటు కొంచెం తగ్గించుకుంటే కిడ్నీలు సేఫ్‌గా ఉంటాయని సూచిస్తున్నారు.
తాజా పండ్లు, కూరగాయలు :
కిడ్నీ సమస్యలు రాకుండా ఉండటానికి ముందు నుంచే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, నారింజ పండ్లను తినాలని సూచిస్తున్నారు. అలాగే ద్రాక్ష, బొప్పాయి వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. పాలకూర, బీట్‌రూట్ వంటి ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది.
ఉప్పు తక్కువగా తీసుకోండి :
ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రంలో కాల్షియం స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హైబీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పును తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.