Tips For Reduce Water Weight :ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి నీరు చాలా అవసరం. మన శరీరం దాదాపు 60శాతం నీటిని నిలుపుకుని ఉంటుంది. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, లూబ్రికెంట్‌గా పనిచేస్తూ పోషకాల ప్రవాహం మెరుగవడానికి సహాయపడుతుంది. అంతే కాదు నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసే బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి శరీరానికి నీరు చాలా ముఖ్యం. అయితే శరీరం దానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని నిలుపుకోవడం ప్రారంభించిందంటే ప్రమాదమేనని చెబుతున్నారు నిపుణులు. శరీరంలో అదనపు నీటి నిలుపుదల మన ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
'వాటర్ వెయిట్' సమస్యతో ఏమవుతుంది?
శరీరం నీటిని అధికంగా నిలుపుకోవడాన్ని ద్రవ నిలుపుదల, నీటి బరువు లేదా ఎడెమా అని పిలుస్తారు. శరీరంలో నీరు పేరుకపోయినప్పుడు పొత్తి కడుపు, కాళ్లు, చేతులు ఉబ్బినట్లుగా అనిపిస్తాయి. నీటి బరువు చాలా అసౌకర్యంగా ఉంటుంది. శరీర బరువులో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మూత్రపిండాల వ్యాధికి కూడా 'వాటర్ వెయిట్' ఓ కారణంగా చెప్పచ్చు.
దీన్ని తగ్గించడం ఎలా?
నీరు ఎక్కువ తాగాలి
నీటి బరువు తగ్గడానికి నీరు ఎక్కువగా తాగాలా! అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా!! అవును మీ శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు సాధారణంగా కన్నా ఎక్కువ నీటిని నిలుపుకుంటుంది. కాబట్టి మీరు రోజంతా నీరు పుష్కలంగా తాగి, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శరీరం అదనపు నీటిని నిలుపుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా 'వాటర్ వెయిట్' తగ్గుతుంది. వీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోస లాంటి పండ్లను మీ ఆహారాల్లో భాగం చేసుకోవాలి.
సోడియం తగ్గించాలి
చాలా సందర్భాల్లో శరీరంలో 'వాటర్ వెయిట్' పెరిగేందుకు ఉప్పు కారణం అవుతుంది. సోడియం శరీరంలో నీటిని ఆకర్షించి, అలాగే నిలుపుకుంటుంది. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక సోడియం కలిగిన ఆహారాలను, ఉప్పును కాస్త తగ్గించడం వల్ల నీటి బరువును తగ్గించుకోవచ్చు.