తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్! - HOW MUCH TIME WALKING PER DAY

-వయసుల వారీగా వాకింగ్ చేయాలని అంటున్న నిపుణులు -వృద్ధులు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చట

How Much Time Walking per Day
How Much Time Walking per Day (Getty Images)

By ETV Bharat Health Team

Published : Nov 18, 2024, 11:30 AM IST

How Much Time Walking per Day:మనం చేసే వ్యాయామాల్లో అతి సులభమైనది, ఇంకా చాలా ప్రభావం చూపేది వాకింగ్. దీని వల్ల గుండె ఆరోగ్యం నుంచి మానసిక ప్రశాంతత వరకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంకా వాకింగ్ చేయడం కూడా చాలా ఈజీ. అన్ని రకాల వయసుల ప్రజలు చాలా సులభంగా చేసుకోవచ్చు. రోజు వాకింగ్ చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతి మనిషి వయసు ఆధారంగా వాకింగ్ చేయాల్సిన సమయం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వారి శారీరక అవసరాలు, సామర్థ్యాలు ఆధారంగా దీనిని నిర్ణయిస్తారని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏ వయసు వారు ఎంత సేపు వాకింగ్ చేయాలో అమెరికాకు చెందిన సర్టిఫైడ్ కోచ్, ట్రెయినర్ Bethany Rutledge వివరించారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

18-30
యువకుల్లో సాధారణంగానే కండరాల్లో బలం ఉండడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. ఫలితంగా రోజుకు సులభంగా 30-60 నిమిషాలు పాటు వేగంగా నడిచే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుందని.. ఇంకా ఒత్తిడి తగ్గి, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుందని వివరించారు. ముఖ్యంగా కూర్చుని ఉద్యోగాలు చేసేవారు తప్పనిసరిగా మధ్య మధ్యలో వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.

31-50
ఈ వయసు వారు 30-45 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో బరువు అదుపులో ఉంటుందని, కండరాలు బలంగా అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడడమే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు. లంచ్ బ్రేక్, పనిలో సమయం దొరికినప్పుడు కొద్దిసేపు నడవాలని సలహా ఇస్తున్నారు.

51-65
మధ్య వయసు వారిలో 30-40 నిమిషాలు సరిపోతుందని నిపుణులు అంటున్నారు. శరీరంలోని మార్పులు, కండరాలు, జీర్ణవ్యవస్థ పనితీరు తగ్గిపోతుండడం వల్ల వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారు వాకింగ్ చేయడం వల్ల ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైతే చేతి కర్ర లాంటి వస్తువుల సహాయంతో నడవాలని చెబుతున్నారు. గాయాలు కాకుండా ఉండేందుకు వాకింగ్ సమయంలో ప్రీ వాకింగ్ వార్మప్, పోస్ట్ వాకింగ్ కూల్ డౌన్ యాక్టివిటీలు చేయాలని సలహా ఇస్తున్నారు.

66-75
వృద్ధులు ప్రతిరోజూ 20-30 నిమిషాలు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో నడవడం వల్ల బ్యాలెన్సింగ్​గా ఉండి కిందిపడి గాయాలు కాకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. ఇంకా గుండె జబ్బులు రాకుండా అరికడుతుందని వివరించారు. వృద్ధులు నడవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుదల ఉంటుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు ఇబ్బంది పడకుండా 15 నిమిషాల చొప్పున రెండు సెషన్లుగా విభజించి నడవాలని సలహా ఇస్తున్నారు.

75 ఏళ్ల పైబడిన వారు
75 ఏళ్లు దాటిన సీనియర్లు నిధానంగా అయిన సరే 15-20 నిమిషాల పాటు నడిస్తే కీళ్ల, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా బ్యాలెన్సింగ్ ఏర్పడి కిందపడకుండా ఉంటారని వివరించారు. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

వాకింగ్ చేసే సమయంలో ఫ్లాట్​గా, సురక్షితంగా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వాకింగ్​కు సరిపడా షూలు వేసుకుని జాగ్రత్తగా చేయాలని సలహా ఇస్తున్నారు. సాధారణంగా 20-60 నిమిషాలు వాకింగ్ చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయని.. కానీ శరీర పరిస్థితుల బట్టి ఎంత సేపు నడవాలో తెలిపారు. ఒకవేళ నడిచే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వాకింగ్​లో మార్పులు చేయాలని లేదా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బరువు తగ్గేందుకు రోజుకు ఎన్ని మెట్లు ఎక్కాలి? ఇది తెలిస్తే లిఫ్ట్​ కూడా వాడరు!

ఇలా చేస్తే ఎముకలు ముక్కలుగా విరిగిపోతాయట! అతుక్కోవడం కష్టమేనట!! మరి బోన్స్ స్ట్రాంగ్​గా ఉండాలంటే ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details