Stairs Climbing for Weight Loss: ప్రస్తుతం ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండేందుకు మెట్లు ఎక్కడం అనేది పాపులర్‌గా మారింది. ముఖ్యంగా వ్యాయామం చేయడానికి సమయం లేనివారు లేదా జిమ్ సదుపాయం లేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు కూడా ఎక్కువగా మెట్లు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఎన్ని మెట్లు ఎక్కడం వల్ల ఎంత బరువు తగ్గుతారో మీకు తెలుసా? ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హెల్త్ ప్రచురించింది. "Effect of Stair Climbing on Cardiovascular Risk Factors in Young Adults" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో కురుక్షేత్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ మనోజ్ కుమార్ ధడ్వాల్ పాల్గొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కడం అనేది కేలరీలను కరిగించి బరువు తగ్గడడానికి, కండరాలను దృఢంగా చేయడానికి సాయపడుతుందని తేలింది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కీలక కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ లాంటి యాక్టివిటీలతో పోలిస్తే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు కరిగినట్లు వివరించారు. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి సుమారుగా 8నుంచి 11 కేలరీలు కరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉందని తెలిపారు.
రోజుకు ఎన్ని మెట్లు ఎక్కాలి?
సాధారణంగా వారంలో ఐదురోజుల పాటు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది దాదాపు 500-700 మెట్లకు సమానమని వివరించారు. ఒకేసారి ఎక్కువ మెట్లు ఎక్కకుండా.. మొదటగా తక్కువ మెట్లతో ప్రారంభించి పెంచాలని సూచిస్తున్నారు. కేలరీలు కరగడానికి శరీర బరువు, ఎక్కిన సమయం లాంటి అనేక విషయాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే వారు మెట్లు ఎక్కడం వల్ల రోజుకు 200-300 కేలరీలు కరిగినట్లు వివరించారు. ఫలితంగా వారానికి దాదాపుగా 200 గ్రాముల బరువు తగ్గుతారని చెబుతున్నారు.