Heart Rate Decrease Reason:మన శరీరంలోని అవయవాలలో గుండె అత్యంత ప్రధానమైనది. ముఖ్యంగా ఈ అవయవం సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పుల కారణంగా చిన్నవయసులోనే గుండె సంబంధింత వ్యాధుల బారిన పడుతున్నారు. ఫలితంగా దీర్ఘకాలం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకా కొందరిలో గుండె సమస్యల వల్ల హృదయం స్పందనల వేగం తగ్గిపోతుంది? ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? గుండెలో ఏర్పడే మిక్సోమా అంటే ఏంటి? దీనికి గుండె వేగం తగ్గడానికి సంబంధం ఉందా? లాంటి ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె వేగం తగ్గినప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఈపీఎస్ ఆర్‌ఎఫ్‌ఏ) అనే చికిత్సను అందిస్తారని ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఎం గోపీచంద్ చెబుతున్నారు. ఈ చికిత్సలో భాగంగా గుండెలో విద్యుత్ సంకేతాలు అస్తవ్యస్తం కావటానికి కారణమవుతున్న కణజాలాన్ని గుర్తించి, దాన్ని ప్రత్యేకమైన పద్ధతితో కాల్చేస్తారని వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుండె లయ కుదురుకుంటుందని అంటున్నారు. అయితే ఇందుకోసం ముందుగా మీ గుండె పైగదుల (కర్ణికలు) నుంచి కింది గదులకు (జఠరికలు) విద్యుత్ సంకేతాలు ఆగిపోయాయా? లయ అస్తవ్యస్తం కావటం వల్ల గుండె నెమ్మదిగా కొట్టుకుంటోందా? అనే విషయాలను పరీక్షిస్తారని వెల్లడిస్తున్నారు. ఇందుకు ఈసీజీ తీసి, నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. సమస్య నిర్ధరణ అయ్యాక అబ్లేషన్ చేస్తారని.. ఆ తర్వాత గుండె కొట్టుకునే తీరును బట్టి పేస్‌మేకర్ బిగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది గుండె వేగం తగ్గుతున్నప్పుడు ప్రచోదనాలను వెలువరించి, నిమిషానికి తగినన్ని సార్లు కొట్టుకునేలా చేస్తుందని వివరిస్తున్నారు.
మిక్సోమా అనేవి గుండెలో ఏర్పడే క్యాన్సర్ రహిత కణితులని డాక్టర్ గోపీచంద్ చెబుతున్నారు. ఇవి సాధారణంగా కర్ణికల్లోనే ముఖ్యంగా ఎడమ కర్ణికల్లో ఏర్పడుతుంటాయని వివరిస్తున్నారు. వీటిని ఆపరేషన్ చేసి తొలగించకపోతే రక్తం గడ్డలు ఏర్పడి, మెదడుకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే మిక్సోమాకు ఆపరేషన్ చేసిన తర్వాత విద్యుత్ సంకేతాలు తగ్గటమనేది అరుదు అని అంటున్నారు. కానీ, గుండె నెమ్మదిగా కొట్టుకోవటానికీ మిక్సోమా ఆపరేషన్‌కూ ఎలాంటి సంబంధం లేదని అభిప్రాయపడుతున్నారు. గుండె కండరంలో లోపం మూలంగానే కొట్టుకునే వేగం నెమ్మదిస్తుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పేస్‌మేకర్ బిగించి, దీన్ని సరి చేయాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇందుకోసం గుండె నిపుణులను సంప్రదిస్తే, కారణాన్ని గుర్తించి తగు చికిత్స చేస్తారని సూచిస్తున్నారు.