Symptoms of Heart Failure : రకరకాల కారణాలతో చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏదో ఒక దశలో గుండెపోటు అనివార్యం అనేట్టుగా తయారయ్యాయి పరిస్థితులు! ఇందుకు మారిన జీవనశైలితోపాటు తినే తిండి, లోపించిన శారీరక శ్రమ ప్రధానకారణాలుగా కనిపిస్తున్నాయి. మరి.. ఉన్నట్టుండి ప్రాణాలు తీసే ఈ గుండెపోటు ప్రమాదాన్ని ముందస్తుగా ఎలా గుర్తించాలో నిపుణులు తరచూ సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు మరికొన్ని కొత్త లక్షణాలు వివరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుండె కండరాలు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంపింగ్ చేయని పరిస్థితే.. హార్డ్ ఫెయిల్యూర్. ఆ టైమ్లో రక్తం తరచుగా బ్యాకప్ అవుతుంది. దాంతో ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోతుంది. ఆ కారణంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి గుండె వైఫల్యాన్ని ముందే తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా ఉదయం కనిపించే లక్షణాలతో వెంటనే అలర్ట్ అవ్వడం మంచిదంటున్నారు. అదేంటంటే.. శరీరంలో కణజాలలో ద్రవం పేరుకుపోవడం వల్ల చీలమండలు, కాళ్లు వాపునకు లోనవుతాయి. దీన్నే 'ఎడెమా' అని కూడా పిలుస్తారు. మీలో ఇలాంటి లక్షణం తరచుగా కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు.
ఈ ఎడెమా సాధారణంగా.. కాళ్లు, చీలమండలం, పాదాలు, చేతులను ప్రభావితం చేస్తుంది. కానీ, శరీరంలోని ఇతర భాగాలలో కూడా సంభవించవచ్చు. ఇది రావడానికి కారణాలను పరిశీలిస్తే.. ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం, గర్భం, కొన్ని మందులు, మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు కారణం అవుతాయి. ఇవే కాకుండా గుండె వైఫల్యానికి సంబంధించిన మరికొన్ని లక్షణాలున్నాయి. అవేంటంటే..
- పని చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు శ్వాస ఆడకపోవడం
- అలసట, బలహీనత
- కాళ్లు, చీలమండలు, పాదాలలో వాపు
- వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన
- వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం
- గురక
- ఎడతెగని దగ్గు
- రక్తపు మచ్చలతో తెల్లగా లేదా గులాబీ రంగులో ఉండే శ్లేష్మం
- బొడ్డు ప్రాంతం వాపునకు లోనవ్వడం
- వేగంగా బరువు పెరుగుట
- వికారం, ఆకలి లేకపోవడం
- తగ్గిన చురుకుదనం