Heart Attack Symptoms in Kids:ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహలో ఐదేళ్ల బాలిక ఆకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పిన వైద్యులు.. ఆ బాలిక గుండెపోటు(Heart Attack) కారణంగానే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొవిడ్ తర్వాత కాలంలో ఎంతో మంది యువకులు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పిల్లలు కూడా బలైపోతుండడంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు.
పిల్లలలో హార్ట్ ఎటాక్ లక్షణాలు :
- ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం
- అలసట
- ఛాతీలో అసౌకర్యం
- తలతిరగడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- గుండెలో దడ
- అరిథ్మియా(గుండె వేగంగా కొట్టుకోవడం)
పిల్లల్లో గుర్తించిన కొన్ని గుండె సంబంధిత సమస్యలు..
పుట్టుకతో వచ్చే గుండె లోపాలు : పుట్టుకతో వచ్చే హార్ట్ డిఫెక్ట్ లేదా CHD అనేది పిల్లల గుండె నిర్మాణంలో వచ్చే సమస్య. ఈ లోపాలు కొన్ని సాధారణమైనవి ఉంటాయి. మరికొన్ని చాలా క్లిష్టంగా ఉంటాయి. అనేక సంవత్సరాలపాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ CHDలు తేలికపాటి (గుండెలో ఒక చిన్న రంధ్రం వంటివి) నుంచి తీవ్రమైన వరకు మారవచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. గుండె లోపంతో పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు CHDని కలిగి ఉంటారు. వారు పుట్టిన మొదటి సంవత్సరంలోనే దీనికి చికిత్స చేయాలి.
రుమాటిక్ గుండె జబ్బు : ఇది రుమాటిక్ జ్వరం వల్ల గుండె కవాటాలు శాశ్వతంగా దెబ్బతినే పరిస్థితి. దీనికి చికిత్స తీసుకోకుండా వదిలేస్తే.. స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఇన్ఫ్లమేటరీ పరిస్థితులకు దారితీస్తుంది. ఫలితంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.
గుండె కండరాల వాపు : దీనిని వైరల్ మయోకార్డిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీనివల్ల గుండె కండరాలకు వాపు వస్తుంది. ఫలితంగా.. గుండె సరిగ్గా కొట్టుకోవడానికి అంతరాయం ఏర్పడుతుంది. పిల్లలలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రధాన కారణాలలో ఇది ఒకటి.
కవాసకి వ్యాధి : పిల్లలలో గుండె సమస్యలు రావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఈ వ్యాధి శరీరంలోని ధమనుల గోడలలో మంటను కలిగిస్తుంది. అలాగే గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులను దెబ్బతీస్తుంది. ఫలితంగా కరోనరీ ఆర్టరీ అనూరిజం ఏర్పడుతుంది.
పిల్లలలో గుండెపోటు రాకుండా కొన్ని చిట్కాలు..
- పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవక్రియను పెంపొందించడానికి డైలీ తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అది వారు ఆరోగ్యంగా ఉండడానికి చాలా సహాయపడుతుంది.
- పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రధానమైనది. ప్రొటీన్లు, ఫైబర్లు, ఖనిజాలు సరైన మోతాదులో అందేలా చూసుకోవాలి. అది వారిలో పోషకాహార లోపం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
- పిల్లలు రోజూ తగినంత వాటర్ తాగేలా చూడాలి. ఫలితంగా వారు హైడ్రేట్‌గా ఉంటారు.
- తగిన మొత్తంలో వాటర్ తీసుకోవడం వల్ల వారి బాడీలో ఉన్న హానికరమైన టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మూత్రపిండాలు, కాలేయం మొదలైన వాటి పనితీరు మెరుగుపడుతుంది.
- రోగనిరోధక వ్యవస్థ పిల్లల్లో బలపడేలా తగిన ఆహారం ఇవ్వాలి.