Post Diwali Health Care Tips:పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆనందకరంగా జరుపుకొనే పండగల్లో ఒకటి.. దీపావళి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతుంటారు. అలాగే ఈ సమయంలో పిండి వంటలు, స్వీట్లకు ఎలాంటి కొదువ ఉండదు. ఈ క్రమంలోనే డైట్ చేసే వారికి కళ్ల ముందు వివిధ వంటకాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే తినకుండా ఉండలేరు.
దీంతో ఇలాంటి సందర్భాల్లో రోజు తినేదానికంటే కాస్త ఎక్కువే లాగించేస్తుంటారు. ఫలితంగా పండగ తర్వాత వివిధ జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాగే దిపాళీవేళ కాల్చే టపాసుల కారణంగా తలెత్తే పొగ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాకాకుండా ఉండాలంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రముఖ న్యూటిషనిస్ట్ డాక్టర్ ఇషి ఖోస్లా. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దీపావళి వంటి పండగల తర్వాత మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉందంటున్నారు డాక్టర్ ఇషి ఖోస్లా. అందులో ముఖ్యంగా మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం చాలా అవసరమంటున్నారు. అంటే.. డైలీ డైట్లో పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. అందులోనూ ప్రధానంగా విటమిన్ సి, ఇ, కాపర్, మెగ్నీషియం, సెలీనియం, జింక్‌తో సహా తగినంత యాంటీఆక్సిడెంట్‌లు శరీరానికి అందేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ఫుడ్స్ని తక్కువగా తీసుకోవడం, వీలైతే అస్సలు తీసుకోకపోవడం మంచిదంటున్నారు.
తగినన్ని వాటర్ తీసుకోవాలి :చాలా మంది ఫెస్టివల్ సమయాల్లో వివిధ పనుల్లో పడి వాటర్ తగినంత తీసుకోరు. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు జీర్ణ సమస్యలూ వస్తాయి. అందుకే అలాంటి సందర్భాల్లో కచ్చితంగా తగినన్ని వాటర్ తీసుకోవడం, వీలైతే కొబ్బరి నీళ్లు, హెల్దీ జ్యూస్‌లు తాగితే ఇంకా మంచిదంటున్నారు.
ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆకలి తగ్గుతుంది. దాంతో మీ ముందు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా.. తక్కువ మోతాదులో తీసుకుంటారు. అలాగే, ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పోవడానికి సహాయపడుతుంది. దాంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా.. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు.